Friday, April 19, 2024
Homeసినిమాఆమె పాటలు వింటుంటే... తేనెవానలో తడిసినట్టు......

ఆమె పాటలు వింటుంటే… తేనెవానలో తడిసినట్టు……

Chitra Singer Has Been Mesmerizing Music Lovers For Four Decades :

మనసుకు తోడుగా నిలిచేది మధురమైన పాటే.  ఆవేదనలో ఓదార్పునిచ్చేది… ఉద్వేగంలో ఊరటనిచ్చేది…  ఊహల్లో తేలిపోయేందుకు అవసరమైన ఉల్లాసాన్నిచ్చేది పాటనే. ప్రతి మనసును పాట పంచామృతమై అభిషేకిస్తూనే ఉంటుంది .. పరమౌషధంగా పనిచేస్తూనే ఉంటుంది. అలాంటి పాట మధురమైన స్వరం నుంచి జాలువారినప్పుడు, అనుభూతుల పరిమళాలు వెదజల్లుతుంది. హృదయమనే ఉద్యానవనంలో ఉత్సాహంగా పరుగులు తీయిస్తుంది. సెలయేటి గలగలలను చిరుగాలిలా మోసుకొచ్చినట్టు అనిపించే ఆ స్వర ప్రవాహం పేరే ‘చిత్ర'(Chitra Singer). 

చిత్ర పూర్తి పేరు .. కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. కేరళలోని ‘తిరువనంతపురం’లో ఆమె జన్మించారు. అది శాస్త్రీయ సంగీత నేపథ్యం కలిగిన కుటుంబం. దేవాలయంలో ఓంకారంలా ఎప్పుడూ సరిగమలు మ్రోగే ఇల్లు. అలాంటి కుటుంబంలో జన్మించిన కారణంగా, ఊహతెలిసిన దగ్గర నుంచే చిత్రకి శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. దాంతో ఆ దిశగా ఆమె అడుగులుపడ్డాయి. ఓమనకుట్టి దగ్గర ఆమె సంగీత సాధన మొదలైంది.

కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందిన చిత్రకి సహజంగానే చిత్రపరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. ఆమె పుట్టి పెరిగింది కేరళలో కనుక, మొదటిసారిగా ఆమె మలయాళంలో పాడారు. ఆమె స్వరం కొత్తగా అనిపించడంతో, తమిళ సినిమాలకు పాడే అవకాశాన్ని ఇళయరాజా ఇచ్చారు. తెలుగులో అనువాదంగా వచ్చిన ‘సింధుభైరవి’ సినిమాతో చిత్ర స్వరం ఇక్కడి  ప్రేక్షకులను స్పర్శించింది. ఆ తరువాత ‘గీతాంజలి’ సినిమాలో ‘జల్లంత కవ్వింత కావాలిలే’ అనే పాట చిత్రకి ఎన్నో అభినందనలను తెచ్చిపెట్టింది. అల్లరి చినుకుల్లో తడుస్తూ ఓ కన్నెపిల్ల పాడుకునే ఈ పాటతో, తెలుగులో చిత్ర స్వరయాత్ర మొదలైందని చెప్పుకోవచ్చు.

అప్పటివరకూ తెలుగు ప్రేక్షకులు .. శ్రోతలు సుశీల – జానకి పాటలను మాత్రమే ఎక్కువగా వింటూ వచ్చారు. సుశీల పాటలు వెన్నెలలా హాయిగా అనిపిస్తే, జానకి పాటలు వెన్నలా కమ్మగా అనిపించేవి. వారు రంగంలో ఉండగా ‘మేము పాడగలము’ అని రికార్డింగ్ థియేటర్లోకి అడుగుపెట్టే సాహసం చేసే పరిస్థితి లేదు. వారిని కాదని కొత్తవారితో ప్రయోగాలు చేసే అవకాశం కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ‘చిత్ర’ తన సహజమైన చిరునవ్వుతోనే రంగంలోకి దిగారు. తన స్వర విన్యాసంతో తోటి గాయనీ గాయకులచేతనే ప్రశంసలను అందుకుంటూ, తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించారు.

అప్పట్లో తెలుగు .. తమిళ భాషల్లో పాడే అవకాశం వస్తే, బాలసుబ్రహ్మణ్యంతోగానీ, యేసుదాసుతో గాని కలిసి పాడాలి. అప్పటికే వారు గాయకులుగా ఎదురులేని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటివారితో కలిసి పాడాలి .. సుశీల, జానకి వాయిస్ ల ముందు తేలిపోకుండా చూసుకోవాలి. ఇలా చిత్ర ముందు ఎన్నో సవాళ్లు ఉండేవి. అయినా చిత్ర ధైర్యంగా అడుగుముందుకు వేశారు. సుశీల .. జానకి స్వరానికి భిన్నంగా .. ప్రత్యేకంగా .. చాలా కొత్తగా ఉందంటూ అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఫలానా పాటను చిత్ర పాడితేనే బాగుంటుందనే అభిప్రాయానికి సంగీత దర్శకులు వచ్చేలా చేయగలిగారు.

వేణువై వచ్చాను’ .. (మాతృదేవోభవ) .. ‘ఎవరు రాయగలరు'(అమ్మరాజీనామా) .. ‘మౌనంగానే ఎదగమనీ’ (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్) .. ‘ఏ శ్వాసలో చేరితే’ (నేనున్నాను) .. ‘ఈ క్షణం ఒకే  ఒక కోరిక’ (ఎలా చెప్పను?) వంటి పాటలు చిత్ర స్వరంలో నుంచి అమృతధారలై కురిశాయి .. వినసొంపుగా విరిశాయి. ఆమె పాటలు వింటుంటే తేనెవానలో తడిసినట్టు ఉంటుంది. పూలవానలో నడిచినట్టు ఉంటుంది. ఈ పాటలన్నీ కూడా చిత్ర గళ మాధుర్యానికి నిర్వచనాల్లా నిలుస్తాయి .. గుండె గదుల్లో అనుభూతల దొంతరలను పేరుస్తాయి .. పన్నీటి తీరాలకు చేరుస్తాయి.

తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను చిత్ర గానామృత ప్రవాహం కొనసాగుతూ వచ్చింది. ఉత్తరాదిన కూడా ఆమె మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఆమె ప్రతిభకు కొలమానంగా పద్మశ్రీ .. పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. మరెన్నో సన్మానాలు .. సత్కారాలు చిత్రకు గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. తెలుగులో సుశీల .. జానకి తరువాత స్థానం ఆమెదే. చిత్ర తరువాత అంతగా ప్రభావితం చేసిన వాయిస్ ఇంతవరకూ రాలేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆమె పుట్టినరోజు నేడు (జూలై 27). ఈ సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో మధురమైన పాటలు ఆమె స్వరం నుంచి ప్రవహించాలని కోరుకుందాం.

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : తీపియాత్రలు చేయించిన రామకృష్ణుడి గాత్రం

RELATED ARTICLES

Most Popular

న్యూస్