వరద సహాయక చర్యల్లో కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నేడు జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా అధికార వ్యవస్థలేవీ పనిచేయలేదని విమర్శించారు. విజయవాడలో వరద బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందన్నారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వస్తున్నాయని, ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొందరు అధికారులు మానవత్వంతో వ్యవహరించడంలేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా కొందరు కావాలనే అలా వ్యవహరిస్తున్నారని, ఇకపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చివరి బాధితుడి వరకూ సాయం అందితీరాలని, రెండ్రోజులుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలు ఇకపై ఇలా ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. పది జిల్లాల నుంచి ఆహారం తయారు చేసి అవసరమైతే ఎయిర్ లిఫ్టింగ్ చేస్తున్నామని…. ప్రతి ఒక్కరికీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ ల ను వారికీ చేర్చాలని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. తన ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తప్పవన్నారు. సింగ్ నగర్ లో అందరూ ఒకే చోటకు రావొద్దని, ప్రజల వద్దకే సాయం పంపిణీ చేస్తామని విజ్ఞప్తి చేశారు. ప్రతి వాహనానికీ ఆక్టోపస్, గ్రే హౌండ్స్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లను పెడుతున్నామని వివరించారు.