Work From Home For Delhi Govt Employees :
కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోం కు ఆదేశించింది. కాలుష్యం తగ్గుముఖం పట్టక పోవటంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 21 వ తేది వరకు ఇళ్ళ నుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు వంద శాతం వర్క్ ఫ్రొం హోం కు ఉత్తర్వులు జారీ చేశామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీ ప్రాంతంలో వివిధ నిర్మాణ పనులు కూడా ఈ నెల 21 వ తేది వరకు నిలిపివేయాలని ఇప్పటికే ఆదేశించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులే నిర్వహిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర సేవలు, వస్తువుల వాహనాలు తప్పితే ఢిల్లీ లో భారీ వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు.
పదేళ్ళు దాటిన డిజిల్ వాహనాలు, 15 ఏళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలు రోడ్డు మీదకు రావటం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేయాలని రవాణ శాఖ, పోలీసు శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజా రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా కొత్తగా మరో వెయ్యి CNG బస్సులు నడిపేందుకు ఢిల్లీ రవాణా సంస్థ ముందుకు వచ్చింది. అయితే మెట్రో రైలు, బస్సుల్లో సీట్ల వరకే ప్రయాణికులను అనుమతిస్తారు. కరోనా నేపథ్యంలో నిలబడి ప్రయాణం చేసేందుకు అనుమతి లేదు. కేంద్రీయ కాలుష్య నియంత్రణ బోర్డు ప్రమాణాల ప్రకారం ఢిల్లీ లో ఈ రోజు గాలి నాణ్యత 387గా నమోదైంది.
మరోవైపు వర్క్ ఫ్రమ్ హోం కు తాము సుముఖంగా లేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో ప్రమాణ పత్రం ( అఫిడవిట్) దాఖలు చేసింది.
Also Read : ఢిల్లీలో లాక్ డౌన్ కు సన్నాహాలు