Thursday, March 28, 2024
HomeTrending NewsWorld Bank: మా సహకారం ఉంటుంది: ప్రపంచ బ్యాంక్ భరోసా

World Bank: మా సహకారం ఉంటుంది: ప్రపంచ బ్యాంక్ భరోసా

ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే దానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఓ ఉదాహరణగా నిలిచిందని ప్రపంచబ్యాంకు ఇండియా డైరెక్టర్ అగస్టే తానో కౌమే ప్రశంసించారు. రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారని,  వివిధ రంగాల్లో చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా చూశామని అంటూ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. అగస్టే తానో కౌమే నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు కలుసుకుంది. ప్రపంచబ్యాంకు ఆర్థిక సహాయంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలు…  ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్‌ లెర్నింగ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఎడ్యుకేషన్‌ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ ప్రాజెక్ట్(ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టులు అమలుపై అడిగి తెలుసుకున్నారు.

దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు వివిధ రంగాల్లో వృద్ధికోసం రుణాలు ఇస్తున్నామని, మీ రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చని కొనియాడారు. “రాష్ట్రంతో మా భాగస్వామ్యం చాలా రోజులుగా కొనసాగుతోంది. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు ఈ సహకారం కొనసాగుతుంది… 2047 నాటి దేశంలానే, రాష్ట్రం కూడా మంచి ఆదాయం ఉన్న రాష్ట్రంగా మారడానికి తగిన సహకారం, మద్దతు మా నుంచి కొనసాగుతుంది  అత్యంత వృద్ధిరేటు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. దేశ సగటు కన్నా.. ఎక్కువ… అభివృద్ధిరేటు చాలా బాగుంది. ప్రజలకు మంచి సర్వీసులు అందుతున్నాయి” అంటూ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆయన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • డైనమిక్‌ పారిశ్రామిక రంగం, వైద్య రంగాలు ఉన్నాయి
  • సమర్థవంతమైన డైనమిక్‌ ప్రభుత్వం ఉంది. వరల్డ్ బ్యాంకుతో చేపడుతున్న కార్యక్రమాలు చాలా బాగా కొనసాగుతున్నాయి
  • మీరు చేస్తున్న చాలా కార్యక్రమాలు జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి
  • ఆరోగ్యరంగంలో టెలిమెడిసన్, ఆన్లైన్ సేవలు, ప్రజలకు చేరువగా వైద్యం, స్వయం సహాయక సంఘాలకు మద్దతుగా నిలవడం, ఇవన్నీ మంచి కార్యక్రమాలు
  • అలాగే విద్యారంగంలో కూడా ప్రపంచబ్యాంకు రాష్ట్రంతో కలిసిపనిచేస్తోంది
  • ఈ రంగంలోకూడా మీరు చాలా బాగాపనిచేస్తున్నారు
  • ముఖ్యమంత్రిగారు స్ఫూర్తిదాయకులు, రాష్ట్రాన్ని రోల్‌ మోడల్ గా తీర్చిదిద్దాలని సీఎం తపనపడుతున్నారు
  • రాష్ట్రంలో మంచి విధానాలు అమలవుతున్నాయి
  • ప్రపంచంలో ఇతర ప్రదేశాల్లో ఉన్న మంచి విధానాలపై మీకు సూచనలు చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో  తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని, ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతినిధి బృందంతో వ్యాఖ్యానించారు.

వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 40వేలమందికిపైగా సిబ్బందిని రిక్రూట్ చేశామని, 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని వివరించారు. ఫ్యామిలీడాక్టర్ కాన్సెప్ట్అమలవుతోందని, ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్బీకేలు ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నామని,  వైద్యం, విద్యం, వ్యవసాయం.. ఈమూడు రంగాల్లో చాలా మార్పులు తీసుకు వచ్చామని, రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం అంటూ ప్రపంచ బ్యాంకు బృందానికి సిఎం స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో సమస్యలకు.. సమూల పరిష్కారాలను చూపే దిశగా ముందుకు సాగుతున్నామని,  ప్రపంచబ్యాంకు ఈ కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరుతున్నానని సిఎం అన్నారు. కేవలం ఆర్థికంగానే కాకుండా మంచి విధానాలను అమలు చేయడంలో, సాంకేతికంగానూ.. ఇలా తమ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశంలో  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎం.టీ.కృష్ణబాబు, ప్రవీణ్‌ ప్రకాష్, శశిభూషణ్‌ కుమార్, సత్యనారాయణ, సురేష్‌ కుమార్, వినోద్‌ కుమార్, పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్