మనదేశంలో జరగాల్సిన టి-20 వరల్డ్ కప్ వేదిక దుబాయ్ కు మారింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో ఈ టోర్నీ నిర్వహించలేక పోతున్నామని.. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసిసి)కి అధికారికంగా నేడు తెలియజేశామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. టోర్నీ తేదీలు, షెడ్యూల్ ను ఐసీసీ అధికారికంగా త్వరలో ప్రకటిస్తుందని షా తెలిపాడు
కోవిడ్ రెండో దశ నేపథ్యంలో ఐపీఎల్- 2021 సీజన్ ను రద్దు చేసినప్పుడే ఇండియాలో టి-20 ప్రపంచ కప్ నిర్వహణపై సందేహాలు తలెత్తాయి. మధ్యలో నిలిచిపోయిన ఐపీఎల్ ను సెప్టెంబర్ 19నుంచి అక్టోబర్ 15వరకూ దుబాయ్ లో నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించి ఈ మేరకు ఐపీఎల్ లో పాల్గొంటున్న అన్ని దేశాల క్రికెటర్లతో పాటు ఆయా బోర్డులకు కూడా సమాచారం ఇచ్చింది. అయితే టి-20 ప్రపంచ కప్ నిర్వహణపై బిసిసిఐ కొంత సందిగ్ధంలో పడింది. మ్యాచ్ లు ఇక్కడే నిర్వహించేందుకు ప్రయత్నాలు చేసినా, ఐపీఎల్ నిర్వహణకు, వరల్డ్ కప్ కు మధ్య ఎక్కువగా వ్యవధి లేకపోవడం, ఇండియాలో కోవిడ్ మూడో దశపై వస్తున్న వార్తల నేపథ్యంలో దుబాయ్ లో టోర్నీ నిర్వహణకే మొగ్గు చూపింది.
ఇండియాలో టోర్నీ నిర్వహిస్తారా లేదా అనే విషయాన్ని తేల్చి చెప్పేందుకు ఐసిసి విధించిన గడువు నేటితో ముగుస్తోంది అందుకే నేడు బిసిసిఐ తన అంతిమ నిర్ణయాన్ని వెల్లడించాల్సి వచ్చింది.