ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమలోని తెలుగు వారందరినీ ఒక వేదిక పైకి తెచ్చేందుకు ఏర్పడిన వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC) అగ్రరాజ్యం అమెరికాలో తన ముద్ర వేసుకుంది. వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్, ఇంటెల్, వంటి వాటికి బీజం పడ్డ ప్రపంచ ప్రఖ్యాత సిలికాన్ వ్యాలీలో తన మొట్టమొదటి అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఐటీ పరిశ్రమలోని అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రం యొక్క ప్రారంభోత్సవం ప్రపంచ తెలుగు ఐటీ మండలి చైర్మన్ సందీప్ మఖ్తల చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది.
ఐటీ పరిశ్రమ భాగస్వామ్యులచే తెలుగు రాష్ట్రాలలోకి పెట్టుబడులు తేవడం, ఎంట్రప్రెన్యూర్‌షిప్ , స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వివిధ భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం లక్ష్యంగా వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ (WTITC- ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి) ఏర్పడింది. తెలుగువారి ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుపతిలో డబ్ల్యూటీఐటీసీ మొదటి స్థానిక కేంద్రాన్ని గత నెలలో ఏర్పాటు చేశారు. దీని తదుపరి అంతర్జాతీయ ఐటీ హబ్ ఖ్యాతి కలిగిన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో డబ్ల్యూటీఐటీసీ యొక్క మొదటి అంతర్జాతీయ కార్యాలయంను WTITC చైర్మన్ సందీప్ మఖ్తల నేడు ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఐటీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది.
అంతర్జాతీయ ఇన్నోవేషన్స్, రీసెర్స్& డెవలప్‌మెంట్, స్టార్టప్‌లకు వేదికగా నిలిచిన సిలికాన్ వ్యాలీలో తెలుగు ఆవిష్కర్తలు, ఐటీ రంగ ఇన్వెస్టర్లు, పరిశ్రమలోని నిపుణులు అందరికీ వేదికగా నిలిచేలా ప్రపంచ తెలుగు ఐటీ మండలి యొక్క మొదటి అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటవడం పట్ల తెలుగు టెకీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా WTITC చైర్మన్ సందీప్ మఖ్తల మాట్లాడుతూ వరల్డ్ ఐటీ కంపెనీలకు హబ్ గా నిలిచిన సిలికాన్ వ్యాలీలో కార్యాలయం ఏర్పాటు తెలుగు వారందరికీ చిరునామాగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ఇదే రీతిలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమెరికాలో ఉన్న తెలుగు ఐటీ రంగ నిపుణులు మాతృభూమి అభివృద్దికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా సందీప్ మఖ్తల కోరారు.
ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఐటీసీ అంతర్జాతీయ కోఆర్డినేటర్ నిరంజన్ నందిమండలం, మండలి సభ్యులు ధర్మేంద్ర బొచ్చు, విజయ, గల్లా శివశంకర్, తదితరుల పాల్గొన్నారు.