Sunday, April 13, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమహిళా దినోత్సవం

మహిళా దినోత్సవం

అసలు స్త్రీలకంటూ ఓ రోజేమిటి?
అన్ని రోజులూ వాళ్ళవే.
ఏదో ఈ రోజు మాటాడుకోవాలి కాబట్టి నాలుగు ముక్కలు.

ఈ ప్రపంచానికి సూర్యుడెలాగో ఇంటికి స్త్రీ అలా.
అంతవరకూ స్తబ్దుగా ఉన్న ఇల్లు ఆమెతో పాటే నిద్రలేస్తుంది.
పాతకాలంలో పెరుగు చిలికే కవ్వాల సరిగమలు ఉంటే…
ఇప్పుడు టీ/ కాఫీ గిన్నెల శబ్దాలు.
మెల్లగా అలికిడి సంతరించుకునే ఇంటి ఉదయపు వెలుగుల్లో-
మన చేతిలో వెచ్చని తేనీటి గ్లాసు ఆమె.
ఇంటి ముందు ముంగిట్లో చిరునవ్వుల రంగు ముగ్గు ఆమె.
దేవుని గదిలో దీపం పక్కన అగరొత్తుల సుగంధం ఆమె.
వంట గదికి రుచులద్దే ఘుమఘుమల తాలింపు ఆమె.
అయినింట్లో నడిచే నీ కడుపున పుట్టిన లక్ష్మీదేవి కాళ్ళ పట్టీల శబ్దం ఆమె.
ఓ అన్నయ్యతోనో అక్కతోనో ఏ చిన్న విషయానికో గొడవ పెట్టుకునే అందమైన అల్లరి ఆమె.
ఏం నాన్నా ఇంకా లేవలేదు… బారెడు పొద్దు లేచింది అనే నానమ్మ మమకారం ఆమె.

Youtube : https://www.youtube.com/@MahathiBhakthi
Facebook : https://www.facebook.com/mahathibhakthi
Instagram: https://www.instagram.com/mahathibhakthi/
Twitter : https://x.com/Dhatri_Tv

జీవితం ఓ వేదిక అనుకుంటే…అందులో అన్ని అందమైన పాత్రలూ ఆమెవే.
నానమ్మగా ,అమ్మమ్మగా , తల్లిగా, అక్కగా , చెల్లిగా , ఇల్లాలుగా ఇంకా ప్రియురాలిగా.. స్నేహితురాలిగా ..కూతురిగా…

ఈ పాత్రలు లేని లోకాన్ని ఓసారి ఉహించుకోండి…
బతుకు ఎంత నిస్సారంగా ఉంటుందో మీకే తెలుస్తుంది.

ఇల్లాలు లేని ఇల్లు ఓ గర్భగుడి లేని ఓ దేవాలయం అయితే…
అసలు స్త్రీ లేని లోకం పచ్చటి ప్రేమ తెలియని ఓ ఎండల ఎడారి కాదూ!

నిజమే.
తరతరాలుగా మగాడి ఆధిపత్యానికి అలవాటుపడ్డ ప్రపంచమే మనది.
అతడి బలం , అతడి ధైర్యం వల్ల ప్రతి సమజంలోనూ అతడిది యజమాని స్థానమే అయ్యింది.
కానీ ఆ స్థానం వెనుక ఓ స్త్రీ లాలిత్యం;
నీవు సాధించగలవని మగాడిలో నూరిపోసిన నమ్మకం;
కష్టకాలంలో సేదదీర్చే ఓపికైన మనస్తత్వం కచ్చితంగా ఉంటాయి.
అంతెందుకు… స్త్రీయే లేక పోతే-
స్త్రీ కోసం కాకపోతే మగాడు ఏ విజయం కోసం తనదైన రంగంలో పోరాడతాడు?
ఏ గుర్తింపు కొరకు ఆరాటపడతాడు?

మహిళకు ప్రకృతి ఇచ్చిన వరం అమ్మతనం.
ఆ తొమ్మిది మాసాల తొలకరే లేకపోతే భూమిపై మనుషుల మనుగడేదీ?
బ్రహ్మ బొమ్మలు చేస్తాడో లేదో మనం చూడలేదు గానీ…
కచ్చితంగా అమ్మ ప్రతి ప్రాణికీ బ్రహ్మే.
ఓర్పుతో తొలి తొలి అడుగులు వేయడం నేర్పుతూ… నేర్పుతో విద్యాబుద్ధులు దిద్దే అమ్మ ఏ బ్రహ్మ కన్నా తక్కువ?

ఇన్ని వెలుగుల మహిళకు సూర్యుడిలా ఒక్కోసారి మబ్బు కమ్మేస్తుంటుంది.
తన విలువ తెలియని మగని చేతిలోనో..
చేసిన మేలు మరిచిన పిల్లల్లోనో.. తననో ఆటబొమ్మగా చూసే సమాజంలోనో.. ఆ మబ్బు ఒక్కోసారి కన్నీరు కారుస్తుంది.
ఆమె గుండెలో దుఃఖం సెలయేరై ప్రవహిస్తుంది.
అయినా ఆమె ఓ నిండైన నదిలా తన గుండె గదిలో తన వారిని ప్రేమిస్తూనే ఉంటుంది.

అందుకే రండి…
ఈ ఆకాశమంతటి ప్రేమనూ,
సముద్రమంతటి ఆ మనసు లోతునూ, భూగోళమంతటి ఓర్పునూ కాస్త అర్థం చేసుకోండి. ఇంకాస్త గౌరవించండి.
కొంచెం ఆనందంగా బతకనివ్వండి.
అందరికోసం బతికే ఆమెకూ దోసెడు ఆహ్లాదం పంచండి.

అవసరాలు తీర్చే బొమ్మలా కాకుండా- మనందరి కోసం బతికే
అమృతాల కొమ్మలా చూడండి.
ఆ జాలి గుండెతో యుద్ధాలు చేయకండి.
ఆ జాజి రెమ్మను పదిలంగా చూసుకోండి.
ఇది జరిగిన నాడు ఈ ప్రపంచం మరింత అందంగా మారుతుంది.
ఇది జరగని నాడు అరాచకం ప్రబలి కాలం కన్నీటి బొట్టును కారుస్తూనే ఉంటుంది.
అది మానవాళికి ఎంత మాత్రమూ మంచిది కాదని మనకు తెలుస్తూనే ఉంటుంది.

Youtube : https://www.youtube.com/@dhatritvtelugu
Facebook : https://www.facebook.com/dhatritelugutv
Instagram: https://www.instagram.com/dhatritelugutv/
Twitter :https://x.com/Dhatri_Tv

ఈ రోజు ప్రపంచ మహిళా దినోత్సవం…

కాదు, కాదు…

ఇది మన అందరి జీవితాలకు దొరికిన మహిమా మూర్తుల దినోత్సవం.

-కిలపర్తి త్రినాథ్
9440886844

RELATED ARTICLES

Most Popular

న్యూస్