వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ సవ్యంగా పూర్తయ్యే అవకాశాలు కనబడడం లేదు. సోమవారం నాలుగోరోజు మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయ్యింది. సౌతాంప్టన్ లో కురుస్తున్న వర్షాలకు తొలిరోజు ఆట రద్దయిన సంగతి తెలిసిందే. వర్షం కాస్త తెరిపివ్వడంతో రెండోరోజు ఆట మొదలైంది. ఒకట్రెండు సార్లు వెలుతురు కారణంగా ఆటకు అంతరాయం కలిగినా మ్యాచ్ కొనసాగింది. ఇక మూడోరోజు ఆట బాగానే సాగిందని చెప్పుకోవచ్చు.
రెండోరోజు 64.4 ఓవర్లలో మూడు వికెట్ల సష్టానికి 146 పరుగులు చేసిన ఇండియా మూడో రోజు మరో 51 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తం 92.1 ఓవర్లపాటు ఇండియా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాతా టామ్ లాథమ్, కాన్వేలు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన ఈ జోడీని రవిచంద్రన్ అశ్విన్ విడదీశాడు. ఆ తర్వాత అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కాన్వే ఇషాంత్ శర్మ బౌలింగ్ లో షమీ అందుకున్న క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 12 పరుగులతో క్రీజులో ఉండగా, రాస్ టేలర్ ఇంకా పరుగుల ఖాతా ప్రారంభించలేదు.
నాలుగో రోజు కూడా ఆట సాగకపోవడంతో ఇక ఈ మ్యాచ్ లో ఫలితం తేలే ఆస్కారం కనబడడం లేదు, ఇరు జట్లూ సంయుక్తంగా ‘గద’ను పంచుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.