Green Paper: రాష్ట్రంలో అప్పులు ఏడు లక్షల కోట్ల రుపాయలకు చేరుకున్నాయని, ఆర్ధిక పరిస్థితి అధఃపాతాళానికి చేరుకుందని మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మూల ధన వ్యయం అడుగంటుతోందని, రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయని పేర్కొన్నారు. 2020-21లో ఏపీ తలసరి ఆదాయం 1.40 శాతం మేర క్షీణించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలు 90 శాతం నుంచి 180 శాతానికి పెరిగిపోయాయని, అభివృద్ధి మందగించడంతో నిరుద్యోగం పెరిగిపోతుందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణ గాలికొదిలేసి రాష్టాన్ని అప్పుల ఊబిలోకి దిగజార్చారని, దీనిపై చర్చించేందుకు వెంటనే గ్రీన్ పేపర్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓటిఎస్ పేరుతో లబ్ధిదారుల నుంచి బలవంతంగా వసూళ్ళకు పాల్పడుతున్నారని, దీనిపై వెనక్కు తగ్గకపోతే వైసీపీ ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు స్థాయికి చేరుకుందని, ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలనూ తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా విస్మరిస్తున్నారని విమర్శించారు.
సిఎం జగన్ ఇప్పటికైనా మొండితనం వీడి ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దృష్టిపెట్టాలని, సమీక్షలు నిర్వహించి, రెండంకెల వృద్ధి సాధించేందుకు కృషిచేయాలని మొత్తం ఆర్ధిక పరిస్థితిపై గ్రీన్ పేపర్ విడుదల చేయాలనిసూచించారు.
Also Read : అప్పులకు ఆదిపురుషుడు బాబు: భరత్