అప్పులకు ఆదిపురుషుడు బాబు: భరత్

Its not fair:
‘అప్పులకు ఆదిపురుషుడు’ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అని వైఎస్సార్సీపీ నేత, రాజమండ్రి లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై టిడిపి ఎంపీలు నిన్న మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు నేడు స్పందించారు. చంద్రబాబు మోడల్ అనుసరిస్తే రాష్ట్రానికి మిగులు బడ్జెట్ ఉంటుందని చెబుతున్న టిడిపి ఎంపీలు వారి హయాంలో చేసిన అప్పులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు షుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని భరత్ వివరించారు.  తాము కట్టించిన బిల్డింగ్ లలో మీరు ఉంటున్నారని వారు అడుగుతున్నారని,  వారు కట్టినవన్నీ రేకుల షెడ్లు మాదిరిగా ఉన్నాయని, ఇవి కేవలం తాత్కాలిక భవనాలేనని.. ఈ విషయాన్ని వారే గతంలో చెప్పారని భరత్ గుర్తు చేశారు. పోలవరం కోసం ఏడు ముంపు మండలాలు ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని నాడు మోడీకి చెప్పిన చంద్రబాబు, ప్రత్యేక హోదాపై ఇలా ఎందుకు చెప్పలేక పోయారని ప్రశ్నించారు.

గంజాయి విషయంలో కూడా ప్రభుత్వంపై టిడిపి నేతలు చేస్తున్న విమర్శలను భరత్ ఖండించారు. టిడిపి హయాంలో గంజాయిపై నాటి మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. లోక్ సభలో తాను మాట్లాడిన అంశాలను వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉందని తాను చెప్పలేదని, కోవిడ్ మహమ్మారిపై, ఎఫ్ఆర్బిఎం పరిమితిపైనే మాట్లాడానని భరత్ వివరణ ఇచ్చారు. గతంలో ఎప్పుడో బడ్జెట్ సమావేశాల్లో చంద్రబాబు హయంలో పరిపాలనపై, ఆర్ధిక పరిస్థితిపై మాట్లాడానని కానీ, ఆ వీడియో ను మార్ఫింగ్ చేసి నిన్న మాట్లాడినట్లు చెప్పడం కనకమేడల పెద్దరికానికి తగదని భరత్ హితవు పలికారు.  భరత్ తో పాటు మీడియా సమావేశంలో ఎంపీలు చింతా అనురాధ, వంగా గీత, డా. రాజీవ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

Also Read : తిరుపతి వరద బాధితులకు సిఎం ఓదార్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *