అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సాధిస్తోందని మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ళ పాలనలో అప్పులే తప్ప ఆదాయ మార్గాలపై దృష్టి సారించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వం తెస్తున్న అప్పులకు సంబంధించిన వివరాలు కూడా సరిగా అందుబాటులో ఉండడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు 32 నుంచి 43 శాతానికి పెరిగాయని చెప్పారు. సంక్షేమంపై పెద్దఎత్తున ఖర్చు చేస్తున్నామని ఈ ప్రభుత్వం చెప్పుకుంటోందని, కానీ మొత్తంగా సంక్షేమ రంగానికి గత ప్రభుత్వం కంటే తక్కువగానే ఖర్చు చేస్తోందని వివరించారు. పేదరికంలో గతంలో ఆరవ స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు 2వ స్థానానికి దిగజారిందన్నారు యనమల.
జగన్ ప్రభుత్వం ఇప్పటికి 2.68 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిందని, వీటిలో సంక్షేమానికి 68,632 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కనబడుతోందని, మిగిలిన 1.99 లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయో అర్ధం కావడం లేదని యనమల వ్యాఖ్యానించారు. ఈ డబ్బులు ఏమయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని అయన డిమాండ్ చేశారు. సంక్షేమంలో దేశంలో మన రాష్ట్రం 18వ స్థానంలో ఉందన్నారు.