ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేని పాకిస్థాన్ పాలకులు జమ్మూ కాశ్మీర్ లో అలజడి సృష్టించేందుకు నిత్యం కుయుక్తులు పన్నుతోంది. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు..ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పట్టు నిలుపుకునేందుకు పాకిస్థాన్ ముస్లిం లీగ్ నేతలు ఎత్తుగడ వేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటె వాళ్ళు మద్దతు ఇచ్చిన వారే ఆక్రమిత కాశ్మీర్ లో గెలవటం ఆనవాయితీగా వస్తోంది. మొదటి నుంచి కీలు బొమ్మ ప్రభుత్వాలే కాశ్మీర్ లో అధికారంలో ఉంటున్నాయి.
ఇప్పుడు అదే కోవలో కాశ్మీరీల్ని ప్రసన్నం చేసుకునేందుకు పాక్ అధికార పార్టీ నేతలు ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా కశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ భార్య ముషాల్ హుస్సేన్ ముల్లిక్ ఇప్పుడు పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రభుత్వంలో భాగం కానున్నారు. ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కాకర్‌కు ఆమె ప్రత్యేక సలహాదారుగా వ్యవహరించనున్నారు. మానవ హక్కులు, మహిళా సాధికారిత తదితర అంశాలలో ఆమె సలహాదారుగా ఉంటారని పాక్ వర్గాలు తెలిపాయి. కాగా, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జేకేఎల్‌ఎఫ్ కమాండర్ యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష పడటంతో ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిద్దరికీ 2009లో వివాహమైంది.