ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వారాంతం వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈమేరకు రాష్ట్రంలోని ఉత్తరకాశీ, చమోలీ, రుద్రప్రయాగ, తెహ్రీ, డెహ్రాడూన్, పౌరీ గర్వాల్, పితోర్‌గఢ్ సహా పలు జిల్లాలకు మంగళవారం ఐఎండీ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రుషికేశ్ కు 40 కిలోమీటర్ల దూరంలో వేలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, వేలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు. వీరిలో బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన తెలుగు యాత్రికులు చాలా మంది ఉన్నారు. తిరుగు ప్రయాణంలో వారంతా అక్కడ చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి తమను రక్షించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా.. వర్షాలకు సంబంధించిన సంఘటనల్లో రాష్ట్రంలో ఇప్పటి వరకు 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం వరకు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్ సహా కొండ ప్రాంతాలైన ఐదు జిల్లాలకు ఐఎండీ అలర్ట్ ప్రకటించింది. టెహ్రీ గర్వాల్, డెహ్రాడూన్, పౌరీ గర్వాల్, చంపావత్, నైనిటాల్, హరిద్వార్ కు బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. డెహ్రాడూన్ నగరానికి సమీపంలో ఉన్న తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయ మెట్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.