Saturday, March 7, 2026
HomeTrending Newsరేపు వినుకొండకు వైఎస్ జగన్

రేపు వినుకొండకు వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బెంగుళూరు పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని తాడేపల్లి చేరుకుంటున్నారు. ఈ సాయంత్రం అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరుగుతున్నా పోలీసులు సరిగా స్పందించడంలేదని…. క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.  నిన్న వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ ఘటనను జగన్ తీవ్రంగా ఖండించారు. రేపు జగన్ వినుకొండలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రషీద్ అంతిమ యాత్రలో పాల్గొనాలని నిర్ణయంచారు.

వినుకొండ హత్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం’’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.

రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్‌షా లకు ట్విటర్ ద్వారా జగన్ విజ్ఞప్తి చేశారు. ” రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి శ్రీ మోదీగారికి, హోంమంత్రి శ్రీ అమిత్‌షాగారికి విజ్ఞ‌ప్తిచేస్తున్నాను. వైయస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అంటూ పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular