Sunday, January 19, 2025
HomeTrending Newsకరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

ఆరోగ్య శ్రీ ని ఎంతో పెద్ద మనసుతో వైయ‌స్‌ ప్రవేశపెట్టారని, పేద‌ల ఆరోగ్యం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు వైయ‌స్‌ రాజశేఖర రెడ్డని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఈ రోజు ఆరోగ్య పరిస్థితి వర్ణ‌ణాతీతంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శుక్రవారం ఎల్లారెడ్డిపెట్ మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో క‌రోనా బారిన‌ప‌డి కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన 14 బాధిత కుటుంబాల‌ను వైయ‌స్ ష‌ర్మిల ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా బాధిత‌ కుటుంబాలకు వైయస్ షర్మిల గారు భరోసా క‌ల్పించారు.

 కరోనా లాంటి పెద్ద జబ్బులు వస్తే పట్టించుకొని వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని షర్మిల ప్రశ్నించారు.  అప్పులు చేసి కుటుంబాలు రోడ్డున పడటానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు.  కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చకపోవడానికి గల కారణం ప్రభుత్వం తెలపాలని షర్మిల డిమాండ్ చేశారు.

సామాన్యులకు 10 నుంచి 20 లక్షల రూపాయల కరోనా బిల్లులు వేస్తే వాళ్ళు ఇల్లు, వాకిళ్లు తాకట్టు పెట్టినా రోగం న‌యం కాలేదని, కేసీఆర్ మాత్రం యశోద ఆసుపత్రికి కి వెళ్తారని ఎద్దేవా చేశారు. కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబాల‌కు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి పేదల కన్నీళ్లు చూడాలని హితవు పలికారు.

కరోనాను ఆయుష్మాన్  భార‌త్ నుంచి ఆరోగ్య శ్రీలో చేర్చాలని షర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు ఎన్నికల పైన ఉన్న సోయి పేద ప్రజల ప్రాణాలపైన లేదని మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా కెసిఆర్ మార్చారని ఆరోపించారు. విద్యాలయాలు ఇప్పుడే తెరవ‌డం మంచిది కాదని, పిల్లల ప్రాణాలకు ముప్పు పొంచిఉందని షర్మిల హెచ్చరించారు. పాఠ‌శాల‌లు ఇప్పుడే ప్రారంభించవద్దని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్