ప్రజాప్రస్థానంలో భాగంగా YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల 52వ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలం పెద్దకిష్ణాపురంలో పాదయాత్ర ప్రారంభించారు. గ్రామంలో రైతులతో కలిసి వడ్ల కొనుగోళ్లపై ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి చిన్నకిష్టాపురం, మంగళి తండా, ముల్కనూర్, గుంపెల్లగూడెం, నర్సింహులగూడెం, ఇందిరానగర్ మీదుగా పాదయాత్ర సాగింది. సాయంత్రం బయ్యారం మండలకేంద్రంలో మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించి, ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.
మాట ముచ్చట కార్యక్రమంలో వైయస్ షర్మిల మాట్లాడుతూ..
విభజన హామీల్లో ఒక్కటైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని బీజేపీ, టీఆర్ఎస్ గాలికొదిలేశాయి. కేసీఆర్, బీజేపీతో డ్యూయెట్లు పాడి, విభజన హామీని మర్చిపోయిండు. ఉక్కు ఫ్యాక్టరీ వస్తే వేలు సంఖ్యలో ఉద్యోగాలు వచ్చేవి. ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. వైయస్ఆర్ హయాంలో రాష్ట్రంలో 3.34లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్షా 20వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. అధికారులతో వచ్చి, కుర్చీ వేసుకుని మరీ పోడు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లు వేయించుకున్నాక ఇటువైపు చూడలేదు. రేవు దాటే వరకే ఓడ మల్లన్న.. రేవు దాటాక బోడ మల్లన్న అన్నట్లు కేసీఆర్ వ్యవహరించాడు.
కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకే కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మిషన్ భగీరథ, కాళేశ్వరం పథకాలకు అప్పులు తెచ్చి మరీ నిధులు కేటాయించాడు. కమీషన్లు రాని ఆసరా పెన్షన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ కు మాత్రం ఒక్క రూపాయి కేటాయించడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తే దోచుకోవచ్చు.. దాచుకోవచ్చు అనేదే కేసీఆర్ పాలసీ. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. రెండుసార్లూ ప్రజలను మోసగించారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు.
కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశారు. మూడెకరాల భూమి ఇస్తానని దళితుల్ని మోసం చేశారు. దళితబంధు ఇస్తానని మోసం చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలనూ మోసం చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగమని యువతను మోసం చేశారు. నెలకు రూ.3016 నిరుద్యోగు భృతి అని నిరుద్యోగులనూ మోసం చేశారు. కేసీఆర్ కు ఎంత సేపు రాజకీయాలే తప్పా ప్రజల గురించి ఆలోచన చేయడు. వాళ్ల కుటుంబానికి తప్పతే ఎవరికీ మేలు చేయలేదు.
బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణగా మార్చాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బాధల తెలంగాణ, పేదలకు బతుకే లేని తెలంగాణగా మార్చాడు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్లు, బార్ల తెలంగాణగా మార్చాడు. కేసీఆర్ ను నమ్మి మళ్లీ మళ్లీ మోసపోవద్దు.. గాడిదకు రంగుపూసి ఇదే ఆవు అని మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో మోసపోవద్దు. ప్రజలకు ఓటు ఒక ఆయుధం. ఆలోచనతో ఓటు వేయాలి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గట్టి బుద్ధి చెప్పాలి. మాట తప్పని, మడమ తిప్పని వైయస్ఆర్ బిడ్డగా మాటిస్తున్నా.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.