ముఖ్యమంత్రిగా కేసీఅర్ 8 ఏళ్లుగా ఉండి తెలంగాణకు ఒరిగింది ఏమి లేదని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంతా మాటల గారడీ అని ఎద్దేవా చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గం దుద్యాల మండల పరిధిలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర. హకీంపేట గ్రామ పరిధిలో రైతుల కోరిక మేరకు పొలంలో దిగి కూలీలతో కలిసి వరి నాట్లు వేసిన షర్మిల. ఆ తర్వాత కోస్గి మండలం సర్జఖాన్ పేట గ్రామస్థులతో మాట్లాడిన వైఎస్ షర్మిల వారి బాగోగులు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ మాట ఇచ్చి తప్పడం మోసం చేయటం కెసిఆర్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేరలేదని, రుణమాఫీ,డబుల్ బెడ్ రూం,మూడెకరాల భూమి,పోడు పట్టాలు,57 ఏళ్లకు పెన్షన్..ఇలా అంతా మోసమే అన్నారు. కేసీఅర్ ముఖ్యమంత్రి కాదు..మోసగాడని ఘాటుగా విమర్శించారు. విపక్షాలుగా కాంగ్రెస్,బీజేపీ తమ పాత్ర పోషించడం లేదని, ప్రజల పక్షాన నిలబడలేదని ధ్వజమెత్తారు. అందుకే కేసీఅర్ ఆడింది ఆట..పాడింది పాటగా మారిందన్నారు.
కేసీఅర్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని వైఎస్ షర్మిల వెల్లడించారు. కేసీఅర్ మోసాలను ఎండగడతానన్నారు. పాలకులు తెలంగాణలో సమస్యలు లేవని చెప్తున్నారని సమస్యలు ఎత్తి చూపడానికి పాదయాత్ర చేస్తున్న అని తెలిపారు. తెలంగాణలో కనీసం పంట నష్టం జరిగితే పరిహారం ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వమని, 12 వందల మంది బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ ఇందుకేనా అని ప్రశ్నించారు. ఓట్లు వస్తె చాలు కేసీఅర్ వస్తాడని, గాడిదకు రంగు పూసి ఆవు అని నమ్మిస్తాడని హెచ్చరించారు. కేసీఅర్ పాలన అంతా దొంగల రాజ్యం..దోపిడీ దారులు రాజ్యమన్నారు.
మునుగోడు ఎన్నికలు వస్తున్నాయి..మళ్ళీ కొత్త హామీలతో కెసిఆర్ వస్తాడని, ఈసారి బిసి బందు..ఎస్టీ బందు అంటాడని వైఎస్ షర్మిల అన్నారు. రెండు సార్లు కేసీఅర్ కు ఓటు వేసి మోస పోయింది చాలని, మరోసారి ఓటు వేస్తే మీకు భవిష్యత్ ఉండదని ప్రజలను హెచ్చరించారు. ఈసారి ఆలోచన చేసి ఓటు వేయండని, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తిరిగి తెస్తానని భరోసా ఇచ్చారు. ప్రతి పేద కుటుంభానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు, మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీద పెడతానని వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు.
Also Read : గూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు YS షర్మిల