Ysrcp Cadre Celebrated Praja Sankalpa Yatra 4th Year Celebrations :
వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై నవంబర్ 6వ తేదీ నాటికి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సర్సీపీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించాయి. ఆ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కడికక్కడ పాదయాత్రలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి సభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకట రమణ, రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. జగన్ మోహన్ రెడ్డిగారి ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. చివరగా పాదయాత్ర బృందాన్ని శాలువాలతో సత్కరించారు.
మంత్రి సురేష్ మాట్లాడుతూ జగన్ గారి ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టమని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో పేదలు, బడుగు, బలహీన వర్గాల కష్టాలు స్వయంగా చూసిన జగన్, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపకల్పన చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనను ఉక్కు సంకల్పంగా ఆయన అభివర్ణించారు. ఏదైనా అనుకున్నా… ఎవరికైనా మాట ఇచ్చినా… దాని కోసం ఎంత దూరమైనా వెళ్ళగల దమ్ము, ధైర్యం గల నేత జగన్ గారు అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ గారి భావజాల సాఫల్యానికి ప్రతి ఒక్కరూ పునరంకితం అవుతూ… ఆయన అడుగులో అడుగేస్తూ… మరో 30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, దేశంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషిలా గుర్తింపు పొందితే… రాష్ట్రంలో ఉక్కు మనిషి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అభివర్ణించారు. దేశ రాజకీయాల్లోనే జగన్ గారు ఒక సంచలమని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో రోల్ మోడల్‌గా జగన్ గారు ఎప్పటికీ నిలిచిపోతారని మోపిదేవి అన్నారు.
డాక్టర్ ఉమ్మారెడ్డి పరిపాలనను గ్రామ స్థాయికి… సంక్షేమాన్ని గడప స్థాయికి… రైతు ప్రయోజనాలను గట్టు స్థాయికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. ఇదంతా కూడా ప్రజా సంకల్ప పాదయాత్ర స్పూర్తి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరత్నాల కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి, వడ్డీలు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సైదు గాయత్రీ సంతోషి, కుమ్మరిశాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండేపూడి పురుషోత్తం, కృష్ణా జిల్లా జడ్పీ వైస్ ఛైర్‌పర్సన్ గరికపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: సంకల్ప యాత్ర చరిత్రాత్మకం: ధర్మాన