పార్టీ అసమ్మతి కార్యకలాపాలకు పాల్పడుతోన్న నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ మరోసారి లోక్ సభ స్పీకర్ కు విజ్ఞప్తి చేసింది.
ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభలో పార్టీ నేత మిథున్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ సమావేశమయ్యారు. రఘురామ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సమర్పించామని, గతంలో పలుసార్లు ఆయనపై అనర్హత పిటిషన్ ఇచ్చామని, త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈరోజు మరికొన్ని ఆధారాలను స్పీకర్ కు సమర్పించారు. జూలై 19 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలలోపే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు విన్నవించారు.
కాగా, నిన్న రఘురామ కృష్ణం రాజు కూడా స్పీకర్ ను కలిశారు, ఇటీవల సిఐడి అధికారులు కస్టడీలో తనపై వ్యవహరించిన తీరును సభలో వెల్లడించేందుకు అవకాశం ఇవ్వలని విజ్ఞప్తి చేశారు.