YSRCP MPs with PM:
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. వాస్తవానికి రేపటితో ముగియాల్సి ఉండగా ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న బిల్లులు, సభా కార్యకలాపాలన్నీ సజావుగా సాగడంతో నేటితోనే ఉభయ సభలనూ నిరవధికంగా వాయిదా వేశారు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ బృందంలో లోక్ సభా పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డా. సంజయ్ కుమార్, సత్యవతి, వంగా గీత తదితరులు ఉన్నారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ శాఖల మంత్రి పియూష్ గోయెల్ తో కూడా వైసీపీ ఎంపీలు సమావేశమయ్యారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అయన దృష్టికి తీసుకెళ్ళారు. రాష్ట్రం విడిపోక ముందు ఈ కేటాయింపులు చేశారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత జీ ఎస్ డీ పీ లో తగ్గుదల ఉందని, ఆ మేరకు ఎపీకి మరిన్ని కేటాయింపులు చేయాల్సి ఉందని, దీనిపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. గోయెల్ ను కలిసిన వారిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మార్గాని భరత్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, డా. సత్యవతి, చింతా అనురాధ, తలారి రంగయ్య ఉన్నారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి నేతృత్వంలో మరికొంతమంది వైసీపీ ఎంపీల బృందం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆమె కార్యాలయంలో కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్ళి త్వరిత గతిన నిధులు విడుదల చేయాలని కోరారు, రాష్ట్రానికి ఆర్ధికంగా చేయూత అందించాలని వినతి పత్రం అందించారు. నిర్మలను కలిసిన వారిలో వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, వంగా గీత, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
Also Read : అశోక్ గజపతి ప్రవర్తన సరికాదు : బొత్స