Saturday, July 27, 2024
HomeTrending Newsఅశోక్ గజపతి ప్రవర్తన సరికాదు : బొత్స

అశోక్ గజపతి ప్రవర్తన సరికాదు : బొత్స

Its not fair:
రామతీర్థం ఆలయ పునఃనిర్మాణ పనులకు శంఖుస్థాపన సందర్భంగా అశోక్ గజపతిరాజు ప్రవర్తన సరికాదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ గుడి మాన్సాస్ ట్రస్టుకు సంబంధించినదని చెబుతున్న అశోక్ గజపతి ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని బొత్స ప్రశ్నించారు. నేటి తీరుతో ఆయన దుర్భుద్ధి, దృక్పథం, నీచమైన ఆలోచన ఏమిటో బైటపడ్డాయని వ్యాఖ్యానించారు. తన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో… అయన అధికారంలో ఉన్నప్పుడు గానీ, తాము అధికారంలో ఉన్నప్పుడు గానీ ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదని బొత్స అన్నారు.

75 సంవత్సరాల వయసు వ్యక్తి అశోక్ ప్రవర్తించే తీరు ఇదేనా అని నిలదీశారు. ఒకవేళ అయన మనసుకు ఏదైనా బాధ కలిగినా అది వ్యక్తం చేయాల్సిన తరహాలో చేయాలి గానీ, క్రిమినల్ స్వభావంతో వ్యవహరించడం తగదని బొత్స హితవు పలికారు. శంఖుస్థాపన అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి, మంత్రి వెల్లంపల్లి తో  కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. తాతల కాలం నుంచి తమకు గొప్ప చరిత్ర ఉందని చెప్పుకునే అయన ఇలా చేసి తన పరువుతో పాటు జిల్లా పరువు కూడా తీశారని బొత్స ఆక్షేపించారు.

రామతీర్థం ఆలయ ఛైర్మన్ గా ఆలయ అభివృద్ధిలో ఆయనకు బాధ్యత లేదా? గుడికి ఫలానా పని కావాలని ఏనాడైనా ప్రభుత్వానికి లేఖ రాశారా అని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు, ఆలయంలో గత ఏడాది జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు ముందు అసలు అశోక్ గజపతి ఈ ఆలయాన్ని తరచూ సందర్శించలేదని, ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకొని శంఖుస్థాపన చేస్తుంటే ఇప్పుడు వచ్చి రాద్ధాంతం చేయడం తగదని వెల్లంపల్లి పేర్కొన్నారు. వంశపారంపర్య ధర్మకర్తగా ఆయనకు గౌరవం ఇచ్చాం కాబట్టే శిలాఫలకంపై పేరు కూడా వేశామని, కానీ అయన ప్రతి విషయంలో కోర్టుకు వెళ్లి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే పనిలో ఉన్నారని, తన గౌరవాన్ని కాపాడుకోలేకపోతున్నారని వెల్లంపల్లి విమర్శించారు. అశోక్ గజపతి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Also Read : రామతీర్థంలో ఉద్రిక్తత

RELATED ARTICLES

Most Popular

న్యూస్