9.8 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending NewsAP Politics: వైసీపీలో జోష్ నింపిన సాధికార యాత్ర

AP Politics: వైసీపీలో జోష్ నింపిన సాధికార యాత్ర

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందరి దృష్టీ తెలంగాణా ఎన్నికలపైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎక్కడ నలుగురు కలిసినా మన పక్క రాష్ట్రంలో ఎలాంటి ఫలితం రానుందనే దానిపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. అక్కడ పూర్తి కాగానే ఏపీలో ఎన్నికల వేడి మొదలు కానుంది. అధికార వైఎస్సార్సీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. తెలంగాణలో బిజెపితో కలిసి పోటీ చేస్తున్న జనసేన ఇక్కడ టిడిపితో జతకట్టింది. ఏపీలో ఈ ఇద్దరితో బిజెపి కూడా కలుస్తుందా లేదా అనే దానిపై డిసెంబర్ చివరి నాటికి ఓ స్పష్టత రానుంది. ‘యువ గళం’, ‘బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’; జనసేనాని ‘ వారాహి విజయ యాత్ర’లతో జనంలో తిరిగారు. బాబు అరెస్ట్ నేపథ్యంలో రెండు నెలలుగా ఈ రెండు పార్టీలు తమ కార్యక్రమాలకు బ్రేక్ ఇచ్చాయి. నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరిట ప్రజల్లోకి వెళ్ళినా అది ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితమైంది.

అరెస్ట్ తో బాబుకు ఏ మేరకు సానుభూతి దక్కిందో లేదో తెలియదు కానీ విపక్షాల దూకుడుకు వైఎస్ జగన్ కళ్ళెం వేయగలిగారు. ఇదే సమయంలో జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నాయి.

తాజాగా వైఎస్సార్సీపీ… సామాజిక సాధికార బస్సు యాత్ర పేరిట జనంలోకి వెళుతోంది. డిసెంబర్ చివరి వరకూ సాగనున్న ఈ యాత్ర దాదాపు అన్ని నియోజకవర్గాలనూ చుట్టి వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. నాలుగున్నరేళ్లుగా ఎస్సీలు, ఎస్టీలు, బిసిలు, మైనార్టీలకు రాజకీయంగా పదవులు కట్టబెట్టడం, సంక్షేమ పథకాల్లో ఆయా వర్గాలకు ఎంత వరకూ మేలు జరిగిందీ, ఎన్ని నిధులు కేటాయించారనే అంశాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మీడియాలో ఈ సాధికార యాత్రకు అంతగా ప్రచారం లభించడంలేదు. అయితే యాత్రలకు ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమిష్టిగా… ప్రాంతాల వారీగా యాత్రలో పాల్గొంటూ కార్యకర్తలు ఉత్తేజపరుస్తున్నారు. యాత్రలకు వస్తున్న ప్రజాదరణపై సిఎం జగన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ స్పూర్తిని ఎన్నికల వరకూ కొనసాగించాలని ఆయన భావిస్తున్నారు.

బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, డిప్యూటీ సిఎంలు రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, నారాయణ స్వామి, అంజాద్ భాషాలు మాజీ మంత్రులు పార్థసారథి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఎంపిలు నందిగం సురేష్, బీద మస్తాన్ రావు తదితరులు యాత్రలకు నేతృత్వం వహిస్తుండగా, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు తెరవెనుక యంత్రాంగం నడిపిస్తున్నారు.

ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ కొన్ని మీడియా సంస్థలు, విపక్ష నేతలు కొంతకాలంగా చేస్తోన్న వాదనలకు ఈ యాత్ర అడ్డుకట్ట వేయగలిగింది. పట్టణ ప్రాంత ప్రజల్లో ఒకట్రెండు అంశాల్లో ప్రభుత్వంపై కొంతమేర అసంతృప్తి ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఇప్పటికీ తమ వెంటే నడుస్తున్నారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన బాబు, పవన్ కళ్యాణ్ సభలకు ధీటుగా ప్రజానీకం వైసీపీ సాధికార యాత్రలకు తరలివస్తున్నారు. ఈ స్పందనతో అధికార పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. ఈ ఉధృతిని ఇలాగే కొనసాగిస్తే వైసీపీకి వచ్చే ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి టిక్కెట్ల పంపిణీలో కూడా జగన్ ఓ పక్కా వ్యూహాన్ని అనుసరించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సాధికార బస్సు యాత్ర తో విపక్షాలపై ఓ సరికొత్త అస్త్రాన్ని జగన్ ఎక్కుపెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్