ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీతో సంబంధం లేదని… ఆయన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధాని గురించి కొత్తగా అడగడం మంచిది కాదన్నారు. విభజన చట్టంలోని అంశాలను సాధించేలా కృషి చేస్తానని సుబ్బారెడ్డి చెప్పారన్నారు. పార్టీ విధానం చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయమై సుబ్బారెడ్డితో తాను మాట్లాడానన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలు త్వరగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతమన్నారు. ప్రత్యేక హోదా కూకూడా సాధించుకునే దిశలో తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఎన్నికల కోణంలో తాము ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నామంటూ టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా బొత్స తీవ్రంగా స్పందించారు. తమకు అలాంటి అలవాటు లేదని, వారివి చౌకబారు విమర్శలని తిప్పికొట్టారు.
సిఎం జగన్ ను ఆడిపోసుకోవడమే తన పనిగా టిడిపి వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగితేనే తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని జగన్ పదే పదే చెబుతున్నారని… విపక్షం కూడా తాము విద్య, వైద్య రంగాల్లో చేసిన పురోగతిలో ఏవైనా లోపాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.