Sunday, September 8, 2024
HomeTrending Newsజహీరాబాద్ లో మైనారిటీలు, దళితుల ఓట్లే కీలకం

జహీరాబాద్ లో మైనారిటీలు, దళితుల ఓట్లే కీలకం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని జహిరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేశాయి. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి సురేష్ షేట్కర్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్, బిజెపి నుంచి సిట్టింగ్ ఎంపి బిబి పాటిల్ (భీమరావు బసవంతరావు పాటిల్) బరిలో ఉన్నారు.

జహిరాబాద్, ఆందోల్, నారాయణ్ ఖేడ్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున పోచారం శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి నుంచి బిజెపి తరపున వెంకటరమణ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలిచారు. మిగతా ఆన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయబావుటా ఎగురవేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ ఎమ్మెల్యే స్థానం దీని పరిధిలోనే ఉండటం గమనార్హం.

మొత్తం ఓటర్లు సుమారు 15 లక్షలు ఉండగా దీని పరిధిలో ముస్లింలు 12 శాతం, SCలు 18 శాతం మంది ఉన్నారు. ఈ రెండు వర్గాలను ప్రసన్నం చేసుకునే వారిదే గెలుపు. గతంలో ముస్లింలు బీఆర్ఎస్ వెంట ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ను ఆదరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు SCల్లో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరిలో మెజారిటీగా క్రిస్టియన్ మతం స్వీకరించారని సమాచారం.  క్రైస్తవుల ఓట్లు కీలకంగా మారాయి.

శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత బిబి పాటిల్ కారు దిగి కమలం పట్టుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సిట్టింగ్ ఎంపి బిజెపిలో చేరటం హస్తం నేతలకు కంటగింపుగా మారింది. బిబి పాటిల్ కు ఓటమి రుచి చూపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

బిబి పాటిల్ వ్యాపారాలు మహారాష్ట్రలో అధికంగా ఉన్నాయి. దీంతో మొదటి నుంచి ఆయనకు అక్కడి బిజెపి అగ్రనేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరిలకు సన్నిహితుడని పేరుంది. ఆ పరిచయాలతోనే బిబి పాటిల్ బిజెపిలోకి వెళ్ళారని అంటారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సురేష్ షేట్కర్ కు టికెట్ ఇవ్వలేదు. దీంతో గంపగుత్తగా లింగాయత్ ఓట్లు బిబి పాటిల్ కు దక్కాయి. ఈ దఫా ఇద్దరు అభ్యర్థులు అదే సామాజికవర్గం కావటంతో రెండు పార్టీలు పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. లింగాయత్ పెద్దలు అక్కడి వారు కావటంతో కాంగ్రెస్ ను బలపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిసింది.

మరోవైపు మాజీ ఎంపి బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి జహీరాబాద్ ఎంపి టికెట్ కోసం ఎప్పటినుంచో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. పార్టీ మారిన బిబి పాటిల్ కు టికెట్ ఇవ్వటంతో బిజెపి శ్రేణుల్లో అసంతృప్తి నెలకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిని కలుపుకొని పోకపోతే బిబి పాటిల్ కు కష్టాలు తప్పవు.

రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్-బిజెపిల మధ్యనే కేంద్రీకృతం అయినట్టుగా కనిపిస్తోంది. దీనికి తోడు బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు లింగాయత్ సామాజిక వర్గం వారే కావటంతో ఆ వర్గం ఓట్లు ఎవరికి దక్కుతాయనేది ఉత్కంటగా మారింది.

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కావటంతో ఈదఫా జాతీయ పార్టీల ప్రభావం ఉండనుంది. సామాన్య ఓటర్లు బిజెపికి ఓటు వేసేందుకు సిద్దంగా ఉన్నా… పార్టీ ద్వితీయ శ్రేణి ఓట్లను రాబట్టేందుకు అంతగా చొరవ తీసుకోవటం లేదని వార్తలు వస్తున్నాయి. బిబి పాటిలో జుక్కల్ ప్రాంత వాసి కావటంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ప్రాంతాల్లో బిజెపి గాలి వీస్తోందని క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ నుంచి వచ్చిన గాలి వినోద్ కుమార్ కు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చినా నామమాత్రపు పోటీతో సరిపెట్టుకోవలిసిందని అంటున్నారు. మునుపటి ఉపు లేదు… మునుపటి జోష్ లేదు… డిపాజిట్ వస్తే అదే చాలు అన్న రీతిలో గులాబీ నేతలు పనిచేస్తున్నారు.

సురేష్ షేట్కర్ గెలిస్తే అందుబాటులో ఉంటారనే టాక్ ఉంది. నారాయణ్ ఖేడ్ లో మొదట టికెట్ ఇచ్చి ఆ తర్వాత సంజీవ రెడ్డికి ఇచ్చారు. దీంతో షేట్కర్ పట్ల ఓటర్లలో కొంత సానుబూతి ఉంది. లింగాయత్ వర్గం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారని ఆ వర్గం నేతలు అంటున్నారు. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారం ప్రభావంతో కారు గుర్తుకు పడినా… జహిరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పవనాలు బలంగా ఉన్నాయి.

లోకసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షేట్కర్ ఎంపిగా గెలిచారు. 2014, 2019లో బిబి పాటిల్ బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. రెండు సార్లు గెలిచిన బిబి పాటిలో మూడో దఫా జయకేతనం ఎగురవేసేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జహిరబాద్ లో తన పట్టు నిరూపించాలని సురేష్ షేట్కర్ పట్టుదలతో ప్రచారం ఉదృతం చేశారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్