రాష్ట్రంలో ఇవాల్టి నుంచి పగటి పూట కూడా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఆర్టీసీ పలు ముందస్తు చర్యలు తీసుకుంది. దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేసింది.
ఇవాళ్టి నుంచి ఈ నెల 18 వరకు సదుపాయం నిలిపి వేశారు. బస్టాండ్ కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు నడిపే విషయాన్ని పరిశీలిస్తారు.
రాష్ట్రంలో కోవిడ్ రెండో దశ వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 6నుంచి 12 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు వుంటుంది. ఏప్రిల్ 24 నుంచి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తూ వస్తున్న ప్రభుత్వం, కోవిడ్ కేసులు మరింత పెరుగుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పగటి పూట కూడా కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.