Sunday, September 8, 2024
HomeTrending Newsకాశ్మీర్ మాజీ సిఎం మహబూబా ముఫ్తీ నోటి దురుసు

కాశ్మీర్ మాజీ సిఎం మహబూబా ముఫ్తీ నోటి దురుసు

కాశ్మీర్ టైగర్స్ పేరుతో జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో సైనిక బలగాలకు అండగా ఉండాల్సిన కాశ్మీర్ మాజీ సిఎం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ నోటి దురుసు ప్రదర్శించారు. విధులు నిర్వర్తించేందుకు సైనికులు కశ్మీర్‌కు వస్తారని, అయితే వారు శవపేటికల్లో తిరిగి వెలుతున్నారని ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదం సమసిపోయిందని కేంద్రం చెపుతుంటే.. ఈ ఘటనలకు ఎవరు బాధ్యత వహిస్తారని ముఫ్తీ ప్రశ్నించారు.

32 నెలల్లో పెద్దసంఖ్యలో సైనికులు మరణించారని, సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం పహారా కాస్తుంటే చొరబాట్లను ఆపే బాధ్యత ఎవరిదని మెహబూబా ముఫ్తీ అన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని ఆరేండ్లుగా కేంద్ర పాలకులు చెబుతున్నారని పరిస్ధితి అందుకు విరుద్ధంగా ఉందని, ఈ పరిస్ధితుల్లో సాధించిందేమిటంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఉత్తర కశ్మీర్‌లో కేంద్రానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు.

ముఫ్తీ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. కాశ్మీర్ డిజిపి స్వైన్ ని విమర్శించినట్టుగా ముఫ్తీ వ్యాఖ్యలు ఉన్నా… భారత సార్వభౌమధికారాన్ని సవాల్ చేసినట్టుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పిడిపి దారుణమైన ఓటమి చవి చూసింది. రాజోరి -అనంతనాగ్ లో ఎంపిగా పోటీ చేసిన ముఫ్తీ దారుణంగా ఓడిపోయారు. కాశ్మీర్ లో తిరిగి పట్టు పెంచుకునేందుకు మెహబూబా… ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు జమ్మూ డివిజన్‌ దోడా ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపి ఈ ప్రాంతంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కట్టుబడి ఉన్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

అమరజవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన సైనికుల కుటుంబాలకు దేశం అండగా నిలుస్తోందన్నారు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని.. ఉగ్రవాద అంతం చేయడానికి, ఈ ప్రాంతంలో శాంతిని పునరుద్ధరించేందుకు సైనికులు కట్టుబడి ఉన్నారు.

అదే సమయంలో సైన్యం, పోలీసులపై ఉగ్రవాదులు జరిపిన దాడికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ఎల్‌జీ మనోజ్‌ సిన్హా సంతాపం ప్రకటించారు. బలిదానాలకు ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామన్నారు.

అమరులైన జవాన్ల కుటుంబాలకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సంతాపం ప్రకటిస్తూనే బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారత సైన్యంపై ఉగ్రదాడులు పెరగడం ఆందోళనకరమన్నారు. జమ్మూకశ్మీర్‌లో భారత సైనికులపై ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఇందుకు బీజేపీ తప్పుడు విధానాలే కారణమని మండిపడ్డారు.

అందాల కాశ్మీరంలో కల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్న ముష్కరులకు వ్యతిరేకంగా దేశం యావత్తు ఏకతాటి మీదకు రావల్సిన అవసరం ఉంది. రాజకీయ నేతలు పరస్పర విమర్శలు మానుకొని ఆర్మీకి నైతిక స్థైర్యం కలిగించేలా కార్యాచరణకు దిగాలి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్