Wednesday, January 29, 2025
Homeఇంకొన్నితోట దాటని పూల పరిమళాలు….; అక్కడే వాడిపోయి, అక్కడే రాలిపోయి…..

తోట దాటని పూల పరిమళాలు….; అక్కడే వాడిపోయి, అక్కడే రాలిపోయి…..

కరోనా దెబ్బకు పూలమ్మిన చోట కట్టెలు కూడా అమ్ముకోలేక బాధపడుతున్నారు పూలసాగు రైతులు. దేశంలో పూల సాగుకు కర్ణాటక పెట్టింది పేరు. ఈరోజు సాయంత్రం కోసిన పూలు మరుసటి రోజు ఉదయానికి ప్రపంచం నలుమూలలా చేరేలా కర్ణాటకలో చాలా ఏళ్లుగా పెద్ద వ్యవస్థ ఉంది. వేల కోట్ల వ్యాపారం. పెద్ద మార్కెటింగ్ చెయిన్.

నిజానికి ఉగాది, శ్రీరామనవమికి పూలకు బాగా డిమాండు. అంతకు మించి పెళ్లిళ్ల సీజన్. వీటన్నిటి ప్రణాళిక ప్రకారం వేల ఎకరాల్లో కర్ణాటకలో పూలసాగు సాగుతోంది. ఈలోపు ఊహించని ఉపద్రవం కరోనా వచ్చి మీద పడింది. లాక్ డౌన్ తో ఒక్కసారిగా ఇక్కడి పూల రైతుల ఆశలు అడియాసలయ్యాయి. మొగ్గలు విచ్చుకుంటున్న వేళ పూల తేమకు, వాసనకు విపరీతంగా క్రిమి కీటకాలు వాలుతాయి. పూర్తిగా విచ్చుకున్న పూలను వెంటనే కోయకపోతే పురుగులు ఇంకా ఎక్కువగా వస్తాయి. అందుకే గులాబీ, జెర్బారా, సంపంగి లాంటి పూలను మొగ్గగా ఉన్నప్పుడే కాడలుగా కోసి భద్రంగా కవర్లు, కాగితాల డబ్బాల్లో ప్యాక్ చేసి దూర ప్రాంతాలకు పంపుతారు.

మనం పూల సోయగానికి మనసులు పారేసుకుంటాం. కానీ- పూల రైతుల బతుకు మాత్రం పూలబాట కాదు. ముళ్లబాట. మొగ్గలకు పురుగు పట్టకుండా వారానికొకసారి మందు చల్లాలి. లాక్ డౌన్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కరోనాకు మనం భయపడతాం కానీ, విచ్చుకోవాల్సిన పూలు భయపడవు కదా? అవి విచ్చుకుని ఏమిటి మమ్మల్ను ఇంకా కోయలేదే? మాతో పనిలేదా? మా అందం మొహం మొత్తిందా? అని రైతులను ప్రశ్నిస్తున్నాయి. పూలు కోసే అవకాశం లేదు. కోసినా అమ్ముకునే అవకాశం లేదు. అలాంటప్పుడు మళ్లీ మందు ఖర్చు కూడా దండగ అని రైతులు కొమ్మలను నిర్దయగా నరికేసి పొలాల్లోనే వదిలేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వ ఉద్యానవనశాఖ ఈ పుష్ప విలాపాన్ని గమనిస్తున్నామని గంభీరంగా ఒక నిట్టూర్పు విడిచింది. ఈ బాధను హిందూ పత్రిక మంచి వార్తగా ఇచ్చింది.

 

అన్నట్లు -మన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి పూలు మాట్లాడుతున్నట్లుగా “పుష్పవిలాపం” సంభాషణాత్మకశైలి కవిత రాశారు. ఘంటసాల అద్భుతంగా పాడారు.

పూల బాధను ఇంకా ఎందరో రాశారు కానీ- కరుణశ్రీ పుష్పవిలాపం ముందు మిగతా పూల ఏడుపు ఎవరికి వినపడదు.

ఆ అందమయిన పుష్పవిలాపం ఘంటసాల గానమిది-

కరుణశ్రీ అక్షర పుష్పలివి-

 

“నీ పూజ కొసం పూలు కొసుకొద్దామని ప్రొదున్నె మా తోట లోకి వెళ్ళాను ప్రభు”

 

ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళలాడుతుంది, పూలబాలలు తల్లి ఒడిలో అల్లారుముద్దుగా ఆడుకుంటున్నాయి, అప్పుడు …

 

నేనొక పూలమొక్క కడనిల్చి చివాలున కొమ్మ వంచి గోరానేడు నంతలోన విరులన్నియు జాలిగా నోళ్లు విప్పి “మా ప్రాణము తీతువా” యనుచు బావురుమన్నవి , క్రుంగిపోతి–

 

నా మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై

 

అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు

 

ఆయువు గల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి జాతీయత దిద్ది తీర్తుము తదీయ కర్మములలోన స్వేఛ్ఛమై నూయల లూగుచున్ మురియుచుందుము ; ఆయువు దీరినంతనే

 

హాయిగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై

ఎందుకయ్యా మా స్వేచ్చా జీవనానికి అడ్డువస్తావు మేంమికేం అపకారం చేసాం

 

గాలిని గౌరవింతుము సుగంధము పూసి ; సమాశ్రయించు బృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు ; మిమ్ముబొంట్ల నేత్రాలకు హాయిగూర్తుము ; స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో

తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే !!

 

ఇంతలో ఒక గులాబిబాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు…

 

ఊలు దారాలతో గొంతు కురి బిగించి

గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి

ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము

అకటా దయలేని వారు మీ ఆడవారు

 

పాపం మీరు దయాదాక్షణ్యాలు గల మానవులని..

 

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ ; జీవితమెల్ల మీకయి త్యజియించి కృశించి నశించిపోయే

 

మాయౌవనమెల్ల కొల్లగొని ఆఫై చీపురుతోడ చిమ్మి ; మామ్మవల పారబోతురు గదా ! నరజాతి నీతి యున్నదా….

ఓయీ మానవుడా…

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు , సహజమగు ప్రేమ నీలోనచచ్చెనేమి

అందమును హత్య చేసెడి హంతకుండ, మైలపడిపోయే నోయి నీ మనుజ జన్మ

 

అని దూషించెడి పూలకనీయలు కోయలేక ఒట్టి చేతులతో ఒచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొనియు నా ఫై మి కరుణశ్రీ రేఖలు ప్రసరింప చేయుము”

పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్