లాక్ డౌన్ తో ఢిల్లీ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ వెల్లడించారు. ప్రజల సహకారంతో లాక్ డౌన్ విజయవంతమైందని, కోవిడ్ క్రమంగా నియంత్రణలోకి వస్తోందని చెప్పారు.
గత కొద్ది రోజులుగా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య పెంచుతున్నామని, జిటిబి ఆస్పత్రి సమీపంలో కొత్తగా మరో 500 ఐసియు బెడ్లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రస్తుతానికి ఐసియు, ఆక్సిజన్ బెడల కొరత లేదన్నారు.
వాక్సినేషన్ పై ఓ జాతీయ విధానం అవసరమని కేజ్రివాల్ స్పష్టం చేశారు. కేవలం రెండు కంపెనీలు మాత్రమే వాక్సిన్ తయారు చేస్తున్నాయని, నెలకు షుమారు 7 కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి చేసే సామర్ధ్యం వుందని.. ఇలా చేసుకుంటూ పొతే అందరికి వాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్ళ సమయం పడుతుందని, ఈ లోగా మరి కొన్ని దశలు వచ్చే ప్రమాదం ఉందని కేజ్రివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. వాక్సిన్ ఉత్పత్తిని యుద్దప్రాతిపదికన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
పాజిటివిటి రేటు 36 నుంచి 19.1శాతానికి పడిపోయిందని, 5శాతానికి తగ్గితే కాస్త ఉపశమనం లభిస్తుందని ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు.