పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు.. గతేడాది అనుభవాలతో ముందుజాగ్రత్త పడుతున్నారు. బస్సులు, రైళ్లలో సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పరిస్థితి నెలకొంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చెందిన వందలాది మంది వలస కార్మికులు మహారాష్ట్రలో కూలి పనులకు వెళ్తారు. కరోనా నేపథ్యంలో వారు ఇప్పటికే పలువురు సొంతూళ్లకు పయనమయ్యారు. ఇప్పటి దాకా 50 మంది దాకా వారివారి స్వగ్రామాలకు చేరుకున్నారు. మరో 1000 మంది దాకా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఎలాంటి ముందస్తు హెచ్చరికలు చేయకుండా విధించిన లాక్‌డౌన్ కారణంగా.. ఉపాధి కోల్పోయి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూళ్లకు వెళ్లడానికి తిండి, డబ్బు, రవాణా సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అలాంటి కష్టాలు పడొద్దనే ముందస్తుగా వెళ్తున్నట్టు ముంబై లో పనిచేస్తున్న విడపనకల్లు మండల వాసి తెలిపాడు.
వీరి వాదన ఇలా ఉండగా అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. ముంబై లో కరోనా తీవ్రత దృష్ట్యా వీరు తిరుగి వస్తుండడంతో కరోనా మరింతగా పెరుగే అవకాశం ఉందంటున్నారు.గతంలో వీరిని క్వారంటైన్ సెంటర్లకు తరలించిన అధికారులు ఈసారి మాత్రం ఉన్నతాధికారుల నుండి ఎటువంటి ఆదేశాలు,సూచనలు రాకపోవడంతో ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.మొత్తం మీద ఉరవకొండ నియోజకవర్గంలో మరోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు.