Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనా అనుష్టుప్ ప్రహసనం

నా అనుష్టుప్ ప్రహసనం

Yatra Names: హిందూపురం ఎస్ డి జి ఎస్ కాలేజీ తెలుగు అధ్యాపకుడు కర్రా వేంకట సుబ్రహ్మణ్యం సార్ అంటే మా నాన్నకు అపారమయిన గౌరవం. మా నాన్న అవధానాల్లో నిషిద్ధాక్షరి పృచ్ఛకుడుగా చాలావరకు కర్రా సారే ఉండేవారు. కర్రా సార్ దగ్గర అయిదేళ్లపాటు తెలుగు, సంస్కృత వ్యాకరణం నేర్చుకున్నానని మొదట్లో అనుకునేవాడిని. తరువాత కేవలం విన్నానని అర్థమయ్యింది. వ్యాకరణ పాఠం అయ్యాక కొంతకాలం ఛందస్సు కూడా చెప్పారు. గురు, లఘువుల గణాలు పెన్సిల్ తో గీతలు గీసుకుని, యతి ప్రాసలు అండర్ లైన్ చేసుకుని ఒక్కో వృత్తానికి ఒక్కో పద్యం, అనుష్టుప్ లో కొన్ని శ్లోకాలు రాసుకుని ఒకరోజు కర్రా సార్ కు చదివి వినిపించాను.

ఆ క్షణం సార్ మొహం కొయ్యబారిపోయింది. నాకు ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. ఏమి సార్ ఛందస్సు తప్పిందా? యతి మైత్రి కుదరలేదా? వ్యాకరణ దోషాలు ఉన్నాయా? అని నూత్న రచనోత్సాహంతో ప్రశ్నలు గుప్పించాను. ముందు కాఫీ తాగుదాం…అని నా చేతికి గ్లాసు అందించారు.

ఎందుకు…ఇంత ఘోరానికి ఒడిగట్టినావు నాయనా! నిన్ను పద్యాలు రాయమని ఎవరు అడిగినారు? ఇందులో ఏ దోషాలూ లేవు. అన్నిట్లో అర్థం ఒక్కటే లోపించింది. వీటిని బయట ఎవరికీ చూపకు. పద్యం రాయాలనిపించిన ప్రతిసారీ తిక్కన, పోతన, వేమన పద్యాలు చదువు. శ్లోకం రాయాలనిపించిన ప్రతిసారీ వాల్మీకిని, కాళిదాసును చదువు…చాలు…అన్నారు.

ఆతరువాత కూడా సార్ బతికి ఉన్నన్ని రోజులు నేను ఎలాంటి పద్యాలు, శ్లోకాలు రాయకుండా ప్రేమగా ఒక కంట కనిపెట్టి ఉండేవారు. ఈవిషయం మా నాన్నకు చెబితే… ఆయన తృప్తిగా నవ్వుకున్నారు.  నీ మొహానికి ఈ జన్మకు సరళ వచనం చాల్లేరా! అన్నట్లు కర్రా సార్ చెప్పిందే కరెక్ట్ అన్నారు. పాతతరం వాళ్లు కదా! నా శ్లోకాలు లోకానికి శోకాలు అవుతాయని వారి భయం. నా పద్య పాదాలు సంఘంలో నేరాలు- ఘోరాలను పురిగొల్పుతాయని వారి ఆందోళన. ఇరవై ఏళ్లపాటు అపురూపంగా దాచుకున్న ఆ పద్యాలు, శ్లోకాల స్పైరల్ బైండింగ్ నోట్ బుక్ పోగొట్టుకున్నాను. ఎంతగా వెతికినా దొరకలేదు. గురువు కోరుకున్నది కూడా అదేమోననుకుని వదిలిపెట్టాను. ఇంకెప్పుడూ పద్యాలు, శ్లోకాలు రాయడానికి ప్రయత్నించలేదు. గురువు ఆదేశం కాబట్టి…ప్రయత్నించను కూడా.

ఆ తరువాత కవితల మీద పడ్డాను. కవికి జుబ్బా తప్పనిసరి అనుకుని కుట్టించుకుని కొన్నేళ్లు వేసుకుని…ఎక్కడ కవి సమ్మేళనాలు జరిగినా వెళుతూ ఉండేవాడిని. వేదిక మీద ఉన్న కవులకంటే వేదిక ముందు ప్రేక్షకుల సంఖ్య ఎందుకు తక్కువవుతోందో తెలుసుకోలేకపోయాను. 1992 లో జర్నలిజం విద్యార్థిగా ఉండగా నా రూమ్మేట్ ఎమ్మిగనూరు విజయ్ కుమార్ నా తొలిప్రాసల తొలి కవితలకు తొలి శ్రోత. “ఏమి రాస్తున్నావు మధూ!” అంటే భలే ఉంది అన్న పాజిటివ్ ప్రోత్సాహం అనుకుని ఇంకా ఇంకా రాసేవాడిని. నాకోసం హిందూపూర్ మిత్రులు తెచ్చే చిరు తిళ్లు మిస్సవుతాయని నా కవితలు బాగున్నాయనని అన్నట్లు తరువాత ఎప్పుడో చెప్పాడు. పైగా “ఏమి రాస్తున్నావు?” అంటే ప్రశ్న అట. రాసిందేమిటో నీకయినా తెలుసా? అని స్పష్టంగా అడిగినా నేను పట్టించుకోలేదట. ఇంత స్పష్టంగా బాధ పడిన విషయం తెలిసి కవి హృదయం వేయి వ్రక్కలై…అనివార్యంగా కవితలు రాయడం కూడా మానేయాల్సి వచ్చింది.

భాషా శాస్త్ర విద్యార్థిగా తెలుగు, సంస్కృత ఛందో వ్యాకరణలను ఇష్టం కొద్దీ ఎంతో కొంత ఫాలో అవుతుంటాను. వ్యాకరణ వీధుల్లో తిరిగినప్పుడు విన్న పరిభాషను ఎక్కడన్నా వాడితే మా నాన్న భయం భయంగా చదువుతూ ఉండేవారు. ప్రత్యేకించి సంస్కృత ఆధ్యాత్మిక పరిభాషకు లౌకిక వ్యవహారంలో ఒక అర్థం, వేద వ్యాకరణం ప్రకారం మరో అర్థం, వేదాంత ప్రతీకలు అయినప్పుడు ఇంకేవో పారమార్థిక అర్థాలు ఉంటాయని ఉదాహారణలతో పాటు చెబుతూ ఉండేవారు. దాంతో రాసినదాన్ని మళ్లీ తిరగరాయాల్సి వచ్చేది.

ఇదంతా ఇప్పుడు ఎందుకు గుర్తొస్తోందంటే…
పొద్దున్నే నలుగురయిదుగురు ఫోన్ చేసి రాజకీయ యాత్రకు “అనుష్టుప్ నారసింహ యాత్ర” అని అనవచ్చా? అని సందేహం లేవనెత్తారు. వాల్మీకి శోకంలో నుండి పుట్టిన తొలి శ్లోకం అనుష్టుప్ ఛందస్సు. ఒక్కో పాదంలో 16 అక్షరాలు. రెండు పాదాలకు కలిపి మొత్తం 32 అక్షరాలు.

ఉదాహరణకు:-
“కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||”
(దీనికే నాలుగు పాదాలుగా మరొక విభజనను కూడా చెప్తారు. అప్పుడు ఒక్కో పాదానికి 8 అక్షరాలు) 32 నారసింహ క్షేత్రాలను కలుపుతూ యాత్ర కాబట్టి అనుష్టుప్ యాత్ర అని పెట్టామని పేరు పెట్టినవారు అనుకుని ఉండవచ్చు. ఆ అర్థంలో అయితే ద్వా త్రింశతి యాత్ర కావాలి. ఇదే ప్రమాణంతో…ఇతర వృత్త పాదాల్లో ఉన్న అక్షరాల సంఖ్య దిక్సూచిగా …ఇదయ్యాక 19 క్షేత్రాల శార్దూల యాత్ర; 20 క్షేత్రాల ఉత్పలమాల యాత్ర; 21 క్షేత్రాల చంపకమాల యాత్ర; 4క్షేత్రాల కంద యాత్ర; 2 క్షేత్రాల ద్విపద యాత్ర; 6 ప్లస్ 2 మొత్తం 8 అయితే సీస యాత్రలు కూడా చేస్తే…మూలన పడి…నామరూపాల్లేకుండా పోయిన సంస్కృతాంధ్ర ఛందస్సులకు పునర్వైభవం వస్తుందేమోనని భాషాభిమానుల ఆశ!

గంభీరంగా, వినూత్నంగా ఉందని పరిభాషను వాడితే…ప్రమాదాలు ఎలాంటివి జరుగుతుంటాయో తెలియడానికి పెద్దలు ఒక కథను ఉదాహరణగా చెబుతుంటారు. వెనకటికి ఒక ఊళ్లో పరాయి ప్రాంతం భిక్షగాడు అడుక్కుంటున్నాడట. ఏ ఇంట్లో ఎవరూ ముద్ద వేయలేదు. ఒకామె మాత్రం కాసేపు అరుగు మీద కూర్చో...”భోక్తలు” తిని లేచాక…అన్నం పెడతాను అంది. అదేమిటో అర్థం కాకపోయినా అన్నం పెడతాను అంది కదా! అని కూర్చున్నాడు. కాసేపటికి లెక్కలేనన్ని పదార్థాలను వడ్డించింది. తృప్తిగా తిని…రోజూ మీ ఇంట్లో ఇలాగే “భోక్తలు” తినాలి…మేము రోజూ ఇలాగే భోజనాలు చేయాలి…అని ఆశీర్వదించాడట. దాంతో ఆ గృహిణి స్పృహ దప్పి పడిపోయిందట.

దారితప్పిన హిరణ్యకశిపుడి పేగులు చీల్చడానికి స్తంభంలో ఆవిర్భవించాడు నరసింహస్వామి. ఇప్పుడు ఈ అనుష్టుప్ దాడులనుండి తనను తాను రక్షించుకోవడానికి ఏ స్తంభం చాటున దాక్కోవాలో!

ఆర్ టీ సీ బస్సుల వెనకాల తెలుగు అంకెలు ఉంటాయి. మానవమాత్రులయిన తెలుగువాళ్లు ఎవరయినా వాటిని చదవగలరా? అసలు అవి తెలుగు అంకెలని…ఇప్పుడు మనం రాస్తున్నవి, చదువుతున్నవి తెలుగు అంకెలు కానే కావని ఎవరయినా అనుకుంటారా?
ఈ అనుష్టుప్ యాత్రా పరిభాష  అలాంటిది అయి ఉండకపోవచ్చు.

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్