తమిళనాడులోని శివగంగలో అదొక పాత పుస్తకాల దుకాణం. అక్కడ హెర్బల్ టీ తాగుతూ ఎంచక్కా ఉచితంగా పుస్తకం చదువుకునే ఏర్పాటు చేశారు కొట్టు యజమాని. ఆయన పేరు మురుగన్. ఈయన స్వస్థలం శివగంగై సమీపంలోని ఇలంతంకుడి. శివగంగై నుంచి మదురై వెళ్ళే రహదారిలో కాళైవాసల్ ప్రాంతంలో మొదట్లో ఆయన పాతపుస్తకాల దుకాణాన్ని ప్రారంభించారు. దాని పేరు “తమిళ్ కుడియోన్”. దినపత్రికలు చదువుతున్నవారున్నారే తప్ప పుస్తకాలు చదివే వారి సంఖ్యను పెంచడం కోసం ఆయన అతి తక్కువ ధరలకు పాత పుస్తకాలు అమ్ముతుండేవారు.
కరోనా మహమ్మారి సమయంలో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉన్నప్పుడు ఆయన జిల్లాలోని అనేక ప్రాంతాలకు వెళ్ళి ఉచితంగా పాతపుస్తకాలు ఇస్తూ వచ్చారు. ప్రస్తుతం వ్యాధినిరోధక శక్తిని పెంపొందించే రీతిలో హెర్బల్ టీని తన దుకాణంలోనే తయారుచేసిస్తున్నారు. హెర్బల్ టీ ధర కేవలం పది రూపాయలే. హెర్బల్ టీకి అలవాటపడ్డవారు, అలవాటు చేసుకుంటున్న వారు ఈ దుకాణానికి వెళ్తుంటారు. అటువంటి వారికి చదువుకోవడానికి ఉచితంగా పుస్తకాలు ఇస్తున్నారు మురుగన్. వినియోగదారుల నుంచి ఇందుకు విశేష ఆదరణ లభిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పుస్తకాలు చదివే అలవాటు తనకు చిన్నప్పటి నుంచే ఉందన్నారు మురుగన్ !
మన చుట్టూ లభించే మూలికలను వినియోగంలోకి తీసుకురావడం కోసం వాటితో టీ తయారు చేసే దుకాణాన్ని మొదలుపెట్టానన్నారాయన. అలాగే పుస్తక పఠనాసక్తిని జనం మధ్య పెంపొందిం చాలన్నదే తన ఉద్దేశమనికూడా ఆయన చెప్తుంటారు. తన దుకాణానికి వచ్చేవారు టీ తాగాలనే నిర్బంధమేమీ లేదని, ఉచితంగా పుస్తకాలు చదివి పోవచ్చన్నారు. ఆవారై, నత్తయ్ చూరి, కర్పూరవల్లి, ఆడాతోడై, తూదువళై అనే అయిదు రకాల మూలికలతో టీ తయారు చేస్తున్నారు. సిరుధాన్యాలకు సంబంధించికూడా వినియోగదారులకు చెప్తుండే మురుగన్ టీ తాగే వారికి అతి తక్కువ ధరకు సిరుధాన్యాలు ఇస్తున్నారు. సిరుధాన్యాల వాడకంతో ఆరోగ్యంగా ఉండవచ్చన్నది ఆయన అభిప్రాయం.
“మామూలు టీ కన్నా మూలికలతో తయారు చేసే టీకి ఒకింత ఎక్కువ సమయం పడుతుదట. ఈలోపు వారిని ఉట్టినే కూర్చోపెట్టడం ఎందుకని ఆయన పుస్తకాలను చదివే సౌకర్యాన్ని కల్పించారు.
అయితే, హెర్బల్ టీ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఓ చోట చదివాను. వాటిలో ఒకటి రెండు అంశాలు ఇక్కడ చూద్దాం…
హెర్బల్ టీ తయారు చేసుకునే ముందు అందులో వాడే మూలికలేమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కొన్ని మూలికలు చూడడానికి ఒకేలా ఉంటాయి. కానీ, అందులో ఒకటి విషపదార్ధం కావచ్చు. కనుక బాగా తెలిసిన మూలికలతోనే హెర్బల్ టీ తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఈ టీలో వాడే మూలికలు పడకపోతే అలర్జీలు వచ్చే అవకాశం లేకపోలేదు. అందువల్ల, కొత్త మూలికల టీ తాగేముందర డాక్టరుని సంప్రతించడం ముఖ్యం.
ఈ మూలికల టీని తక్కువగానే తీసుకోవాలి. కొద్దిగా తీసుకున్నప్పుడు ఎంత ఆరోగ్యమే ఎక్కువ తీసుకుంటే అంత అనారోగ్యంకూడా! ఈ మూలికల టీని రోజుకి ఒకటి రెండు చిన్న కప్పుల కంటే ఎక్కువ తీసుకోకూడదట.
– యామిజాల జగదీశ్
Also Read: