Sunday, November 24, 2024
HomeTrending Newsతవాంగ్‌పై పట్టు కోసం చైనా బరితెగింపు

తవాంగ్‌పై పట్టు కోసం చైనా బరితెగింపు

భారత సరిహద్దుల్లో చైనా తరచూ కవ్వింపులకు దిగుతున్నది. అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత భూభాగంలోకి చొరబడేందుకు చైనా బలగాలు యత్నించడం ఉద్రిక్తతలను పెంచింది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా, విస్తరణ కాంక్షతో అన్ని సరిహద్దు దేశాలతోనూ కయ్యానికి కాలు దువ్వుతున్నది. భారత్‌ మాత్రం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు సరిహద్దుల విషయంలో ఉదాసీనతే ప్రదర్శిస్తున్నది. భారత ప్రభుత్వాలు చేసిన చారిత్రక తప్పుల వల్లనే నేడు చైనా రెచ్చిపోతున్నదని నిపుణులు అంటున్నారు. మొదట్లోనే సరిహద్దు వివాదానికి రాజకీయ పరిష్కారం కనుగొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని చెప్తున్నారు.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడే చైనా కూడా కమ్యూనిస్టు దేశంగా అవతరించింది. మొదట్లో రెండు దేశాల ఆర్థిక పరిస్థితిలో పెద్దగా తేడా ఉండేదికాదు. ఒకరకంగా చెప్పాలంటే భారతే ఆర్థికంగా కాస్త బలంగా ఉండేది. ఈ రెండు దేశాలకు జమ్ముకశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు చారిత్రకంగా సరిహద్దు వివాదాలున్నాయి. బ్రిటిష్‌ పాలకులు రూపొందించిన మ్యాపుల ఆధారంగా భారత్‌ సరిహద్దులను గుర్తిస్తుండగా, చైనా వాటిని అంగీకరించటం లేదు. వివాదాలున్నా మొదట్లో సరిహద్దుల్లో రెండు దేశాల పెట్రోలింగ్‌ నామమాత్రంగా ఉండటంతో రెండు సైన్యాలు ముఖాముఖి ఎదురుపడేవి కావు. భారత ప్రభుత్వాలు ఇదే ఉదాసీన విధానాన్ని కొనసాగించగా, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి టిబెట్‌ను తనలో కలిపేసుకొన్నది. అంతటితో ఆగకుండా భారత్‌లో భాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ ఆక్రమణకు దిగటంతో 1969లో పూర్తిస్థాయి యుద్ధం సంభవించింది. ఆ యుద్ధ అనుభవాల తర్వాత కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు బలోపేతం చేసుకొనేందుకు భారత ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. చైనా మాత్రం సరిహద్దుల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టడంతోపాటు సైన్యానికి అత్యాధునిక వసతులు, ఆయుధాలు అందుబాటులోకి తెచ్చింది.

భారత సైన్యం భారత్‌-చైనా వాస్తవాధీన రేఖకు 40-50 కిలోమీటర్ల దూరంలో భారత భూభాగంలో స్థావరాలు ఏర్పాటుచేసుకొని ఉంటుంది. ఏడాదిలో ఒకటిరెండు సార్లు మాత్రమే పెట్రోలింగ్‌కు వెళ్లేది. దీంతో చైనా సైన్యంతో గతంలో ఘర్షణలు తలెత్తేవి కావు. చైనా మాత్రం సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తూ వస్తున్నది. చాలాచోట్ల భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్టు సమాచారం. భారత సైన్యం పెట్రోలింగ్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతం తమదేనని చెప్పేందుకు చైనా సైన్యం ఘర్షణకు దిగుతున్నదని భారత మాజీ సైనిక అధికారులు అంటున్నారు. గల్వాన్‌ కానీ, తాజా ఘర్షణ జరిగిన యాంగ్జ్సేకానీ వ్యూహాత్మకమైనవి. యాంగ్జ్సేలో ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి చూస్తే తవాంగ్‌ మొత్తం కనిపిస్తుంది. ఈ ప్రదేశంపై ఎవరు ఆధిపత్యం వహిస్తే వారే.. తవాంగ్‌ లోయ మొత్తంపై ఆధిపత్యం వహించే అవకాశం ఉంటుంది. అందుకే చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది.

డోక్లాం.. 2017లో 73 రోజుల పాటు భారత్‌, చైనా మధ్య నెలకొన్న వివాదానికి కేంద్ర బిందువైన ప్రాంతం. ఈ ప్రాంతం తమదని భూటాన్‌, చైనాలు ఏండ్లుగా వాదించుకొంటున్నాయి. భారత్‌లోని సిక్కిం సరిహద్దుకు ఆనుకొని ఉండే డోక్లాం రీజియన్‌లో చైనా చేపట్టిన రోడ్డు నిర్మాణం తమ దేశ సరిహద్దు భద్రతకు ముప్పు అని భారత్‌ బలగాలు అడ్డుకోవడంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తర్వాత చర్చల అనంతరం రెండు దేశాలు తమ బలగాలను వెనక్కు పిలిపించుకొన్నాయి. అయినప్పటికీ 2017 తర్వాత కూడా చైనా డోక్లాం రీజియన్‌లో నిర్మాణాలు కొనసాగిస్తూ బరితెగిస్తున్నది. కొత్త బ్రిడ్జిల నిర్మాణం, ఇప్పటికే ఉన్న గ్రామాలను విస్తరిస్తున్నట్టు ఇటీవలి శాటిలైట్‌ చిత్రాలు చెబుతున్నాయి. తాజాగా అరుణాచల్‌ సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో.. ఇక్కడ కూడా మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌లోని సిక్కిం, భూటాన్‌, చైనా దేశాల మధ్య జంక్షన్‌లా డోక్లాం రీజియన్‌ ఉంటుంది. డోక్లాం సమీపంలో చైనా మౌలిక సదుపాయాల నిర్మాణాలను వేగవంతం చేసినట్టు తెలుస్తున్నది. టన్నెళ్లు నిర్మించడంతో పాటు సైనిక మోహరింపును రెట్టింపు చేసిందని నిఘావర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టంభన నెలకొన్న డోక్లాం సమీప ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ చేపట్టినట్టు కూడా అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ప్లానెట్‌ ల్యాబ్స్‌ పీబీసీ తాజా శాటిలైట్‌ చిత్రాలు చెబుతున్నాయి. భూటాన్‌ భూభాగంలో చైనా ఏర్పాటు చేసుకొన్న లాంగ్‌మార్పో అని పిలువబడే ఉత్తర సరిహద్దు నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉండే ప్రాంతంలో కొత్త గ్రామాల సమూహాన్ని నిర్మిస్తున్నది. ఈ ప్రాంతాల్లో సైబురు, కైతాంగ్షా, క్యూలే ఉన్నాయి.

వివాదాస్పద డోక్లాం రీజియన్‌కు సమీపంలో 2020లో నిర్మించిన పంగ్డా గ్రామాన్ని 2021లో విస్తరించారు. పంగ్డా సమీపంలో గత ఏడాది నవంబర్‌లో లేని నిర్మాణాలు.. ఈ డిసెంబర్‌లో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. పంగ్డాకు దక్షిణాన కొత్త భవన నిర్మాణ సముదాయాలు, టోర్సా నదిపై బ్రిడ్జి నిర్మాణం వంటివి ఇటీవలి శాటిలైట్‌ చిత్రాల్లో చూడవచ్చు. దీని ద్వారా సిలిగురి కారిడార్‌ సమీపానికి చైనా బలగాలు ముందుకు వచ్చే అవకాశం ఉన్నదనేది భారత్‌ ఆందోళన. డోక్లాంకు దక్షిణ ప్రాంతంలో కూడా భూమిని చదును చేసినట్టు తాజా చిత్రాలు స్పష్టంచేస్తున్నాయి.

తవాంగ్‌ సెక్టార్‌లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణకు చైనా కుయుక్తులే కారణమని తెలుస్తున్నది. నిబంధనల ప్రకారం వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు సమీపంలో ఇరువైపులా ఎలాంటి నిర్మాణం చేపట్టరాదు. చైనా మాత్రం ఇందుకు విరుద్ధంగా వాస్తవాధీన రేఖ వద్ద ఒక అబ్జర్వేషన్‌ పోస్ట్‌ ఏర్పాటుకు ప్రయత్నించిందని, ఈ ప్రయత్నాన్ని భారత సైనికులు అడ్డుకున్నప్పుడే ఘర్షణ జరిగిందని ఓ సైనికాధికారి వెల్లడించారు. శీతాకాలం సందర్భంగా భారత బలగాలు చేసుకుంటున్న ఏర్పాట్లు, కదలికలను తెలుసుకునేందుకు చైనా ఎల్‌ఏసీ వద్ద ఓపీ నిర్మించాలనుకుందని చెప్పారు. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని భారత సైనికులు చెప్పినా వినకపోవడంతో చైనా బలగాలను తరిమేశారని పేర్కొన్నారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్