Saturday, November 23, 2024
HomeTrending Newsబ్రిటన్ చరిత్రలో నవశకం... ప్రధానిగా రిషి సునాక్

బ్రిటన్ చరిత్రలో నవశకం… ప్రధానిగా రిషి సునాక్

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన రిషి సునాక్‌ ఆ దేశ రాజకీయాలతో పాటు ప్రపంచ రాజకీయాల్లో నవశాకానికి నాంది పలికారు. ఈ నెల 28న బ్రిటన్‌ ప్రధానిగా ప్రమాణం చేస్తారు. ఐరోపాలో స్థిరపడిన భారతీయులకు…ముఖ్యంగా బ్రిటన్ లోని భారతీయులకు ఈ ఏడాది దీపావళి..సరికొత్తగా వెలుగులు నింపనుంది. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించి.. కొన్ని వందల ఏండ్ల పాటు భారత్‌లో వలస పాలన సాగించింది బ్రిటన్‌. ఈరోజు అదే వలస పాలన దేశమైన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌.. బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

రిషి సునాక్‌ పూర్వీకులు పంజాబ్‌ రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి.. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్‌, ఎకానమీ కోర్సుల్లో పట్టా అందుకున్నారు. 2001-04 మధ్య గోల్డ్‌మాన్‌ సాక్‌లో విశ్లేషకుడిగా సేవలు అందించారు. రెండు హెడ్జ్‌ కంపెనీల్లో పని చేశారాయన.

ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షత మూర్తిని రిషి సునాక్‌ పెండ్లి చేసుకున్నారు. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రిషి సునాక్‌ తొలిసారి 2014లో రిచ్‌మండ్‌ నుంచి బ్రిటన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2017, 2019 ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. అత్యంత ధనవంతులైన ఎంపీల జాబితాలో రిషి సునాక్‌ పేరు నమోదైంది.

తొలుత బ్రిటన్‌ సహాయ మంత్రిగానూ, తర్వాత క్యాబినెట్‌ మంత్రిగా, చాన్స్‌లర్‌గా పని చేశారు. బ్రిటన్‌ చాన్స్‌లర్‌గా పని చేసిన తొలి భారతీయుడిగానూ రిషి సునాక్‌ చరిత్ర నెలకొల్పారు. ఆయనకు ఫుట్‌బాల్‌, క్రికెట్‌, ఫిట్‌నెస్‌, సినిమాలు అంటే ఎంతో ఇష్టం. బోరిస్‌ జాన్సన్‌ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసిన రిషి సునాక్‌.. నాయకుడి వ్యవహారశైలిపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కొవిడ్‌-19 మహమ్మారి ఉధృతి వేళ జాన్సన్‌ అనుసరించిన వైఖరి వివాదాస్పదమైంది. స్కామ్‌లలోనూ బోరిస్‌ జాన్సన్‌ చిక్కుకున్నట్లు తేలడంతో ఆర్థిక మంత్రిగా రిషి సునాక్‌ రాజీనామా చేశారు. తర్వాత జాన్సన్‌ క్యాబినెట్‌లో అత్యధికులు వైదొలిగారు. దీంతో బోరిస్‌ జాన్సన్‌ ప్రధానిగా రాజీనామా చేయాల్సి వచ్చింది.

జాత్యహంకారం అధికంగా ఉండే ఆంగ్లేయులకు వలస దేశ సంతతి వ్యక్తే ఏలుబడి చేయటం ప్రపంచ చరిత్రలో సరికొత్త పరిణామం అనటంలో సందేహం లేదు. ఇన్నాళ్ళు ప్రపంచంలోని అగ్రశ్రేణి సంస్థలకు భారతీయులు నాయకత్వం వహించటం గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అగ్రదేశాల్లో ఒకటైన బ్రిటన్ కే భారత మూలాలు కలిగిన వ్యక్తి సారథ్యం వహించటం ఐరోపాలో భారతీయుల పట్ల దృక్పథం మార్చుతుంది. రిషి సునాక్ ఏలుబడి…భారత్ పట్ల ఆయన దృక్పథం ఏలా ఉన్నా రాబోయే రోజుల్లో అమెరికా..కెనడా..జర్మని..తదితర దేశాల్లో భారతీయుల నాయకత్వానికి రిషి సునాక్ ఎన్నిక స్పూర్తిగా నిలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్