Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరాజు శ్రీవాస్తవ్

రాజు శ్రీవాస్తవ్

He made us cry also: హిందీ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లు ప్రపంచం పట్టనంతగా ఎదుగుతున్నవేళ ఒకసారి స్టాండప్ కమెడియన్ల ప్రోగ్రాం చూస్తున్నప్పుడు రాజు శ్రీవాస్తవ్ దొరికాడు నాకు. దాదాపు పదిహేనేళ్లుగా ఆయన హాస్య కార్యక్రమాలను టీ వీ ల్లోనో, యూ ట్యూబ్ లోనో చూస్తూనే ఉన్నాను. కొన్ని చూసినవే పదే పదే చూస్తుంటాను.

58 ఏళ్లకే రాజు శ్రీవాస్తవ్ కన్ను మూశాడు. దేశంలో హిందీ తెలిసిన అందరికీ రాజు శ్రీవాస్తవ్ పరిచయమే. ఇప్పుడు వేన వేల మంది స్టాండప్ కమెడియన్లు పుట్టుకొచ్చారు. హాస్యాన్ని వృత్తిగా ఎంచుకుని కపిల్ శర్మ లాంటివారు సినిమా హీరోలకంటే పెద్ద సెలెబ్రిటీలు అయ్యారు. ఇలాంటి వేదికలేవీ లేని రోజుల్లోనే ఉత్తరాదిలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా రాజు హాస్యవల్లరి కార్యక్రమం ఉండేది.

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో పుట్టి, పెరిగాడు. తండ్రి హిందీలో చేయి తిరిగిన కవి. దాంతో గజల్స్, పాటలు, జానపదాలు అన్నిటినీ చిన్నతనంలోనే ఒడిసి పట్టుకున్నాడు. చిన్నా చితకా హాస్య కార్యక్రమాలు చేస్తూ బాంబే చేరాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. హాస్య కార్యక్రమాల్లో హిమాలయమంత ఎదిగాడు. బి జె పి లో చేరాడు. చనిపోయేనాటికి ఆయన ఉత్తర ప్రదేశ్ చలనచిత్ర మండలి అధ్యక్షుడు.

లాలూ ప్రసాద్ యాదవ్ ముందు నిలుచుని ఆయన హావభావాలను, గొంతును అనుకరిస్తూ ఆయన మెప్పు పొందినవాడు రాజు.

కుక్కలన్నీ ఒక సామాజిక సమస్య మీద మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చెబుతూ…కుక్కలను అనుకరించి మనల్ను నవ్వించినవాడు రాజు.

దేశంలో విభిన్న హిందీ మాండలికాల అందాల్ని, వైరుధ్యాలను పులకింతగా పాజిటివ్ గా చెప్పినవాడు రాజు.

సంపన్నులు- పేదల మధ్య ఆచారవ్యవహారాల్లో అంతరాలను సున్నితమయిన హాస్యంతో ఎత్తి చూపినవాడు రాజు.

మింగ మెతుకులేనివారి కన్నీళ్లను తుడిచి వారికి కడుపు నిండా హాస్య రస భోజనం పెట్టినవాడు రాజు.

భారతీయ సమాజంలో మెట్రో- పల్లె నాగరికతలు రెండూ కలవని పట్టాల్లా ఎలా సాగుతున్నాయో లోతుగా వివరించినవాడు రాజు.

మనలో లోపాలను మనకే హాస్యం పూత పూసి చూపించినవాడు రాజు.

కడుపుబ్బా క్షణం నవ్వితే…ఈదలేని సప్తసముద్రాల కష్టాలు కూడా చెమ్చాడు భవసాగరం అయిపోతాయని నిరూపించినవాడు రాజు.

హాస్యం అపహాస్యమై…వెకిలి వేయి తలలతో…అర్థం లేకుండా నర్తించే రోజుల్లో…బాడీ షేమింగ్ ను హాస్యం అనుకుంటున్న రోజుల్లో…భాష, మాండలిక మాధుర్యాలు తెలియనివారు హాస్య రస చక్రవర్తులుగా రాజిల్లుతున్న రోజుల్లో…
రాజు శ్రీవాస్తవ్ అవసరం చాలా ఉంది. కానీ…వచ్చినపని అయిపోయినట్లు చాలా త్వరగా వెళ్ళిపోయాడు.

ఆయన బతికి ఉండి పూయించాల్సిన నవ్వులు ఇప్పుడు దిగులుపడుతున్నాయి.
వాస్తవానికి వాస్తవ్ ఎప్పటికీ హాస్య రస రాజు…రారాజు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ప్రజాస్వామ్యానికి రాచరిక కిరీటం

RELATED ARTICLES

Most Popular

న్యూస్