ఆసియా కప్ ముగిసి కొన్నిరోజుల విరామం అనంతరం టీమిండియా మరోసారి వరుస సిరీస్ లు, వరల్డ్ కప్ టోర్నీలతో బిజీ బిజీగా గడపనుంది. స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో సిరీస్ ల అనతరం ఆసీస్ వేదికగా జరగనున్న టి 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో టీమిండియా పాల్గొనబోతోంది.
టీమిండియా స్టార్ ఆటగాళ్ళు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు రికార్డులకు చేరువలో ఉన్నారు. కోహ్లీ మరో 207 పరుగులు చేయడం ద్వారా ఇండియా తరఫున ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు.
ప్రపంచంలోనే మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ మొత్తం 664 ఇన్నింగ్స్ ఆడి 48.52 యావరేజ్ తో 34,357 పరుగులు చేశాడు. వీటిలో వంద సెంచరీలు, 164 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కుమార సంగర్కర (28,106); రికీ పాంటింగ్ (27,483); మహేలా జయవర్దనే (25,957) ; జాక్వెస్ కలీస్ (25,534) లు ఉన్నారు. ఆరో స్థానంలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ 24,208 పరుగులతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 24,002 పరుగులతో ఏడో ప్లేస్ లో ఉన్నాడు. మరో 207 పరుగులు చేస్తే ద్రావిడ్ ను దాటిపోతాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆరో స్థానానికి, ఇండియా నుంచి రెండో ప్లేస్ కు కోహ్లీ చేరుకోనున్నాడు.
మరోవైపు, రోహిత్ శర్మ మరో రెండు సిక్సులు బాదితే అంతర్జాతీయ టి20 చరిత్రలో అత్యధిక సిక్సులు సాధించిన ఆటగాడిగా చరిత్ర తిరగ రాయనున్నాడు. ప్రస్తుతం కివీస్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ 172, రోహిత్ 171 సిక్సర్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
కాగా, ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగనున్న మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ రేపు సెప్టెంబర్ 20న మొహాలీలో మొదలు కానుంది. 23, 25 తేదీల్లో నాగపూర్, హైదరాబాద్ లో మిగిలిన రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇది పూర్తి కాగానే 28 నుంచి సౌతాఫ్రికా తో మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్ జరగనుంది.
Also Read: ఐసిసి మహిళల వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా