అఖిల దేశాల గాడిదల సంఘాల సమైక్య సమాఖ్య- అ. దే. గా. సం. స. స. సమావేశం ఢిల్లీలో ఏర్పాటయింది. నానా జాతి గాడిదలయిన అడ్డ గాడిదలు, కంచెర గాడిదలు, పిల్ల గాడిదలు, వృద్ధ గాడిదలు, పండిత గార్దభాలు, గాయక గార్దభాలు, నాయక గార్దభాలు, మూర్ఖ గార్దభాలు…అన్నీ ఒకసారి వెనుక కాళ్లతో కుర్చీలను తన్ని…చెక్ చేసుకుని…ఓండ్రపెట్టి సుఖాసీనులయ్యాయి. మీడియాను అనుమతించకూడదని గాడిదలు ముందే నిర్ణయం తీసుకున్నా…గాడిద చాకిరీకి అలవాటు పడ్డ కొందరు మీడియా ప్రతినిధులు అలవాటులో పొరపాటుగా లోపలికి ప్రవేశించారు. అర్థం చేసుకున్న గాడిదలు అభ్యంతరం చెప్పలేదు.
“గాడిద వార్తలు” అన్న సమాసానికి-
గాడిదలకు సంబంధించిన వార్తలు అన్న అర్థం ఒక్కటే కాకుండా ఇతరేతర అర్థాలు కూడా మనుగడలో ఉండడం వల్ల అలాంటి సమాసాన్ని వాడవద్దని ఇతరులను గౌరవించే సదుద్దేశంతో పండిత గార్దభాలు ముందే విన్నవించుకున్నాయి.
ప్రార్థన అని యాంకర్ గాడిద మైక్ లో అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా సభ గార్దభ తీవ్ర శ్రుతి ఓండ్రతో దద్దరిల్లింది. అధ్యక్ష గార్దభం నేరుగా మైక్ అందుకుని దిక్కులు పిక్కటిల్లేలా మాట్లాడుతోంది. బ్రీత్ లెస్ శైలిలో సాగిన గాడిద గంట ఉపన్యాసం యథాతథంగా ఇవ్వడం కుదరక మీడియా సారాన్ని మాత్రమే రిపోర్ట్ చేసింది. మీడియాలో వచ్చిన గాడిద సంఘాల సమైక్య సమాఖ్య వార్తల సారమిది.
“కృత, త్రేతా, ద్వాపర- మూడు యుగాలు ముగిసి…కలియుగం మొదటి పాదంలో ఉన్నా…ఇన్ని యుగాల్లో గాడిదలకు సముచిత స్థానం కల్పించాలని అడిగినవారు, గాడిదల మనోభావాలను గుర్తించినవారు లేరు. తొలిసారి ఇందిరాగాంధీ కోడలు, పర్యావరణ ప్రేమికురాలు, రాజకీయ నాయకురాలు మేనకా గాంధీ గాడిదలకు అత్యున్నత స్థానం కల్పించారు. అందుకు మా జాతి ఈ భూమ్మీద ఉన్నంతవరకు ఆమెకు రుణపడి ఉంటాము.
ఆనాటి క్లియో పాత్రా రోజూ పాత్రల కొద్దీ మా పాలతో రుద్దుకోవడం…స్నానం చేయడం వల్లే అందగించిందన్న చారిత్రక సత్యాన్ని మేనకా గాంధీ గారు బహిరంగ సభల్లో బహిరంగంగా మైకు గుద్ది చెప్పడం మాకొక నోబెల్ బహుమతి లాంటిది.
భారత దేశంలో గాడిద పాలు తాగడం వల్ల ఆరోగ్య పరిరక్షణ, గాడిద పాలతో తయారు చేసిన సబ్బుతో రుద్దుకుంటే నిగనిగలాడే చర్మ సౌందర్యం గురించి ఆమె చెబుతుంటే అడ్డ గాడిదలమయిన మాకే బుగ్గల్లో సిగ్గుల మొగ్గలు మొగ్గ తొడిగాయి.
అనాదిగా నిర్లక్ష్యానికి, అవహేళనకు, అవమానాలకు గురయిన మా గార్దభ ఆత్మ సౌందర్య గౌరవాన్ని మేనక గారు తట్టి లేపారు.
బొగ్గుపాల కడుగ పోవునా మలినంబు?
అని వేమన ఆనాడే ప్రశ్నించాడు.
ఇప్పుడు ఆ వేమనే ఉండి ఉంటే
“గాడిదపాల కడుగ పోవును మలినంబు…వచ్చును అందంబు…”
అని కచ్చితంగా కొత్త ఆటవెలది రాసి…పాడేవాడు.
సందర్భం వచ్చింది కాబట్టి…
సామెతల విషయం కూడా ఒక మాటనుకోవాలి. తెలుగు సామెతలు, నుడికారాలు, జాతీయాలు, వాడుక మాటలు మా మనోభావాలను బాగా దెబ్బ తీస్తున్నాయి.
- “వసుదేవుడంతటివాడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట”
- “కూసే గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందట”
- “గాడిద గుడ్డు కాదూ..!”
- “అడ్డ గాడిదలా పెరిగావు…ఎందుకూ కొరగావు”
- “గాడిదలా బరువులు మోయడం”
- “గాడిద చాకిరీ”
- “గుర్రం గుర్రమే- గాడిద గాడిదే”
- “పిల్ల గాడిద ముద్దు- పెద్ద గాడిద మొద్దు”
సృష్టిలో అన్ని ప్రాణులకు బతికే హక్కును భగవంతుడు ఇచ్చాడు. అలాగే మా ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే హక్కు కూడా మాకు ఉంటుందని సవినయంగా తెలియజేసుకుంటున్నాం.
విన్నారా సరి!
లేకపోతే…చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్లే…మా వెనుక కాళ్లు వాటి పని అవి చేసుకుపోతాయి!
కాబట్టి ఈ సభ ముక్త కంఠంతో-
“గాడిదలకేమి తెలుసు గంధపు చెక్కల వాసన?”
అన్న నానుడిని నిరాకరిస్తూ…
“గాడిదలకే తెలుసు గంధపు చెక్కల వాసన”
“గాడిదలకే తెలుసు అందపు చెక్కిళ్ల నునుపు”
“గాడిదలు చెక్కిన శిల్పం”
“గార్దభ క్షీర సౌందర్య న్యాయం”
లాంటి కొత్త పాజిటివ్ మాటలనే వాడాలని తోటి ప్రాణి కోటిని డిమాండు చేస్తోంది!
సభ ఒక్కసారిగా గాడిదల ఓండ్ర హర్ష ధ్వానాలతో మారుమోగింది!
అన్నట్లు…
గాడిదపాలు కొనుక్కుంటాం…అంతర్జాతీయంగా గాడిదపాలకు విపరీతమైన డిమాండు అంటూ ఒక్కో గాడిదను లక్షన్నరకు పైగా అమ్మి…రెండు మూడు నెలలు అన్నట్లుగానే గాడిదపాలు కొని…తరువాత అదృశ్యమయ్యింది డాంకీ ప్యాలెస్ సంస్థ. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసానికి గురైనవారు వేలల్లో ఉన్నారు. ఇప్పటికి ఇది 110 కోట్ల కుంభకోణమని తేలింది. సాధారణంగా 15 వేల నుండి అత్యధికంగా 40 వేల వరకు ధర పలికే గాడిదలను స్థానిక మార్కెట్లోనే కొని…లక్షన్నర నుండి రెండు లక్షల వరకు అక్కడే అమ్మిన ఈ డాంకీ ప్యాలెస్ మార్కెటింగ్ మెలకువలో గాడిదలైనవారెవరో గాడిదలు చెప్పలేకపోవచ్చు కానీ…గాడిదలకు తెలుసు!
- మొత్తం డాంకీ స్కామ్ లో పెట్టుబడి ఎంత? లాభమెంత?
- ఇన్ని జంతువులుండగా వీరు గాడిదలనే ఎంచుకోవడానికి గల కారణాలేమిటి?
- సమాజంలో ఎవరినైనా గాడిదలను చేయవచ్చని వీరు అనతికాలంలోనే ఎలా పసిగట్టగలిగారు?
- ఇంట్లో, పెరట్లో కట్టిన డాంకీ ప్యాలెస్ అత్యుత్తమ గాడిదలను ఇప్పుడేమి చేయాలి?
- గాడిదపాలతో ఏయే పదార్థాలు చేసుకోవాలి?
- ఇంత ఇన్నోవేటివ్ ఐడియా చిన్న స్టార్టప్ అవుతుందా? భారీ పరిశ్రమ అవుతుందా?
- దీన్ని ఫిన్ టెక్ కంపెనీ అనాలా? లైవ్ స్టాక్ బిజినెస్ అనాలా?
1. Adaptations of successful strategies from industry.
2. Importing strategies from other industries.
3. Combining strategies from multiple different industries.
4. Strategies created from scratch.
-అని సకల ఇండస్ట్రీ బిజినెస్ స్ట్రాటజీలు ఈ నాలుగు కేటగిరీల్లోనే ఉంటాయని సంప్రదాయ ఎం బి ఏ పాఠాల్లో చెబుతారు.
ఈ డాంకీ బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనలిటిక్స్ ను చూసిన తరువాత ఇది ఏ స్ట్రాటజీ కిందికి వస్తుందో! లేక అయిదో స్ట్రాటజిగా కొత్తగా చేరిస్తే ఎలా ఉంటుందో! స్టాన్ఫోర్డ్ లు, హార్వర్డ్ లు, ఐ ఐ ఎం లు, ఐ ఎస్ బి లు అర్జెంటుగా ఆలోచించకపోతే నష్టపోయేది ఆ కాలేజీలే…గాడిదలు కాదు!
గాడిదల్లా కళ్ళకు గంతలు కట్టుకుని నాలుగ్గోడల మధ్య క్లాసు రూముల్లో కూర్చుని ఏమి చదువుతారు?
కొంచెం ఇలా బయటికి వచ్చి కళ్ళు తెరిచి విశాల గార్ధభ ప్రపంచంలో చదువుకోండి! అడ్డ గాడిదలు కూడా లెక్కలేనన్ని జీవనవ్యాపార విజయరహస్య పాఠాలు చెబుతాయి!
ఇట్స్ ఎ ఫుల్ ఆఫ్ ఫూల్స్ ప్యారడైజ్!
ఇట్స్ ఎ ప్రామిసింగ్ “డాంకీ ప్యారడైజ్” బిజినెస్!!
నేర్చుకుంటే ప్రతిదీ పాఠమే!
నేర్చుకోకుంటే ప్రతిదీ గుణపాఠమే!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు