Saturday, March 7, 2026
HomeTrending News24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

24 నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం ముహూర్తం నిర్ణయించింది. జూన్‌ 24వ తేదీ నుంచి జులై 3 వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్‌ రిజుజు బుధవారం ప్రకటించారు. 18వ లోక్‌సభ మొదటి సమావేశాలు జూన్‌ 24 నుంచి జులై 3వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణం, స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని తెలిపారు.

రాజ్యసభ జూన్‌ 27వ తేదీ నుంచి మొదలై జులై 3 వరకు కొనసాగనున్నట్లు మంత్రి ప్రకటించారు. జూన్‌ 27 ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో రానున్న ఐదేళ్లలో ప్రభుత్వం చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వెల్లడించనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోడీ..  మంత్రి మండలి సభ్యులను పార్లమెంట్‌కు పరిచయం చేయనున్నట్లు కిరెణ్‌ రిజుజు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వనున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ లోక్‌సభ స్పీకర్‌ పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. సభాపతి పదవి తమకు ఇవ్వాలని అధికార మిత్ర పక్షాలైన టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నాయి. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, మాజీ స్పీకర్ జి ఎం సి బాలయోగి కుమారుడు, టీడీపీ ఎంపీ హరీశ్‌ మాథుర్‌ స్పీకర్‌ రేసులో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే సమయంలో రాజస్థాన్‌ కోటా నుంచి లోక్‌సభకు ఎన్నికైన ప్రస్తుత స్పీకర్‌ ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలూ ఉన్నాయి. దీంతో స్పీకర్‌ పదవి ఎవరికి దక్కొచ్చనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ దఫా సమావేశాల్లో వివిధ అంశాలపై ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నట్లు తాజా పరిణామాలతో అర్థం అవుతోంది. ముఖ్యంగా నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నీట్ అంశంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

-దేశవేని భాస్కర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular