Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం1986 గోదావరి వరదల చేదు జ్ఞాపకం

1986 గోదావరి వరదల చేదు జ్ఞాపకం

Devastating Deluge: గత నెలలో సంభవించిన గోదావరి వరదలు రెండు తెలుగు రాష్ట్రాలలోని పలు జిల్లాల్లో బీభత్సాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నాటికీ గోదావరి ఉగ్రరూపంతోనే ఉంది. అయితే 1986లో సంభవించిన ప్రళయం లక్షలాది మందికి కన్నీరు మిగిలిచింది. నాటి విపత్తును చవిచూసిన ఓ కవి అనుభవం అయన మాటల్లోనే….

ఆగస్టు17 1986….ఆరోజు జీవితంలో మరువలేని రోజు. కడుపు నిండా అన్నం పెట్టే తల్లి గోదారమ్మ ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. కాలవకు నీరొచ్చినా, గోదారికి వరద నీరొచ్చినా ఆ నీటికి కుంకాలిచ్చి హారతులతో గంగాస్తోత్రం చదివే పెద్ద ముత్తయిదవులు ఈ గోదారి తీరమంతా కనబడేవారు. గోదారి నాసిక్ నుండి నరసాపురం వరకూ ప్రవహిస్తున్నా ఒక్క మా జిల్లాలను మాత్రమే గోదావరి జిల్లాలంటారు. అది మా అదృష్టం. మాకు దేవుడిచ్చిన వరం.

ఆగస్టు పదిహేను ఉత్సవ హడావుడి లో పడిపోయిన నాయకులు, అధికారులు గోదావరిని గురించి పట్టించుకోలేదు. ఇంతలో ప్రజాబాహుళ్యంలో పుకార్లు  మొదలయ్యాయి. భధ్రాచలం, ధవళేశ్వరం వరద ఏ ఎత్తులో ఉందో ఆకాశవాణి కేంద్రాలు అన్నింటిలోనూ తెలుగు ఛానళ్ళకు ఇది పెద్ద పగులు వార్తై కూర్చుంది (Breaking News).  ఆగస్టు16న తూర్పుగోదావరి జిల్లా కోనసీమ లోని చాకలిపాలెం …నాగుల్లంక మధ్యన, పశ్చిమగోదావరి జిల్లాలోని మల్లేశ్వరం, ఖండవల్లి మధ్యన రెండు పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో పల్లపు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.

మా నర్సారం గోదారికి సిగురు (చివర) నుంటాది కదా! వరద నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పటి నుండి ఒక్కొక్క డ్యామ్ దాటుకుని సివరాఖరన నర్సారం చేరుకోవాలంటే మూడు రోజులు పడుతుంది. అందుమూలంగా బాధితుల తరలింపు కు తగిన సమయం ఉంటుంది. పూర్తి లెక్కలు అందుబాటులో ఉన్నా, ముమ్మరంగా సహాయక చర్యలు తీసుకునేందుకు తగినంత సమయం ఉంటుంది. కాని అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. కడీం స్లూయిస్ నుండి ఛేదించుకు వచ్చిన వరద జలాలు కాలవలలోంచి పొంగి పొరలి చేలమీదుగా రహదారులమీదుగా ఊళ్ళలోకి వచాయి. 16వ తేదీన అప్పటి దూరదర్శన్ లోనూ, ఆకాశవాణి విజయవాడ కేంద్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితి ని వివరిస్తున్నాయి.

కాని అప్పటికే వరి ఆకుమడులు వేసుకుని చాల చోట్ల ఊడ్పులను కూడ పూర్తి చేసేసుకున్నారు రైతులు. ఆ చేలన్నీ పీకలోతు నీళ్ళతో నిండిపోయాయి. ముఖ్యంగా కోనసీమలో రాజోలు, అమలాపురం తాలూకాలు, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, వీరవాసరం, భీమవరం, తణుకు తాలూకాలు ఏ పక్కకు చూచినా నీళ్ళు తప్ప మరేమీ కనబడలేదు.

నేను అనారోగ్యంతో హాస్పటల్ నుండి డిశ్ఛార్జి అయ్యి ఇంటికొచ్చి మూడు రోజులయ్యింది. 16 శనివారం రాత్రి ఆందోళన తో దూరదర్శన్ లో వస్తున్న’నయాదౌర్’ సినిమా చూస్తున్నాను. ఇంతలో మా తమ్ముడు నరసాపురం.. పాలకొల్లు రోడ్డు మునిగి పోయిందని… ప్రవాహాన్ని చూస్తుంటే రోడ్డు కొట్టుకుపోయి ఉంటుందని చెప్పాడు. వెంటనే ఇంట్లో వారిస్తున్నా వినకుండా వెళ్ళాను. మా తమ్ముడు చెప్పినట్టే పాలకొల్లు వెళ్ళే రోడ్డు కోతకు గురవుతున్న ఆనవాళ్లు స్పష్టంగా కనపడుతున్నాయి.

నరసాపురంలో గోదారి గట్టు చాల బలహీనంగా ఉంది. ఊరి మీదకు నీరొచ్చి పడిపోతుందేమోనన్న భీతి అంతకంతకూ పెరిగిపోతోంది. అలాగే ఊరిలోకి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకూ నీరొచ్చేసింది. ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో వరదనీరు రాలేదు.

అఖండ గోదావరి ధవళేశ్వరం దాటిన వెంటనే శెట్టిపేట-విజ్జేశ్వరం గ్రామాల దగ్గర ఈస్ట్రన్ డెల్టా, సెంట్రల్ డెల్టా, వెస్ట్రన్ డెల్టా లుగా చీలి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను చుట్టుముట్టి గౌతమి నది యానాం దగ్గర, వసిష్ట నది అంతర్వేది దగ్గర సాగర సంగమం చేస్తాయి. నేలతల్లికి పచ్చని పైరుచీరలు తొడుగుతాయి. కన్నులకు మంచి దృశ్యావలోకనాన్ని ఇస్తాయి. అలాంటిది ఈ కాలవలలోకి గవర్నమెంట్ వదిలిన నీటికి తోడుగా గోదారి గండి పడిన చోట్లనుండి వచ్చిన నీటి మూలంగా ఎటుచూసినా ఎర్రని సముద్రమే కనబడుతోంది (మా గోదావరి వరద నీరు ఎర్రగానే ఉంటుంది)

నరసాపురంలో గోదావరి కాలువ గుండా వచ్చే సాగునీరు కొంత భాగం నరసాపురంలోనే గోదావరిలో కలుస్తుంది. మిగిలిన నీరు మొగల్తూరు మీదనుంచి ముత్యాలపల్లి ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టాలో సాగునీరు నరసాపురం కాలువ, ఎర్రకాలువ, వెంకయ్య వల్లేరు కాలువల ద్వారాను, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎర్ర కాలువ ద్వారానూ ఎక్కువగా ప్రవహస్తుంది. యనమదుర్రు డ్రయిన్, ముత్యాలపల్లి, నాగిడి పాలెం ఉప్పుటేర్ల ద్వారా నల్లీ క్రీక్ ను చేరుకుని బంగాళాఖాతంలో నీళ్లు కలుస్తాయి. ఈ వరద మూలంగా నరసాపురం పట్టణంలో గోదావరి నుండి, గోదావరి కాలువ నుండి వరద నీరు వచ్చేసింది.అధికారులు చేష్టలుడిగి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి లో పడిపోయారు.

ఓ ప్రక్కనుండి నరసాపురం కాలువ రోడ్డు మీదకు వచ్చేస్తోంది. ఇంకొక్క అడుగు దాటితే నరసాపురం, సీతారాంపురం,మొగల్తూరు ఊళ్ళు పూర్తిగా మునిగి పోతాయి. అధికారులు చేతులెత్తేశారు.

సరిగ్గా అప్పుడు ఊహించని రీతిలో మనలను మనమే రక్షించుకోవాలని ప్రజలందరూ రంగంలోకి దూకారు. అధికారులు నరసాపురం లాకులు కొట్టుకు పోకుండా ఇసుక బస్తాలను వేస్తున్నారు. వాటిని తీసుకుని నరసాపురం లాకుల దగ్గర నుండి మొగల్తూరు రోడ్డు మీద కాలవ పొడుగూనా ఇసక బస్తాలను వేయడం మొదలుపెట్టాము.సబ్ కలెక్టర్ ఎస్.పి.సింగ్ ఇసుక బస్తాలను తెప్పించారు. ONGC అధికారులు తమవద్ద ఉన్న సిమెంటు, బుఱద ఇసుక కలసిన బస్తాలను వేల సంఖ్యలో ఇచ్చారు. నరసాపురం, రాయపేట,రుస్తుంబాద,సీతారామపురం లలోని ప్రతి ఇంటిలో పని చేయగలిగిన మగవారందరూ ముందు వెనుక చూడకుండా రోడ్ల పైకి వచ్చి ఇసుక బస్తాలను మోసి నరసాపురం లాకుల నుండి మొగల్తూరు వరకూ దాదాపుగా14 కిలోమీటర్ల మేర కాలువకు గట్టును కొన్ని గంటలలో స్వచ్ఛందంగా వేసేశారు. ఆ దృశ్యం 36 సంవత్సరాల తరువాత ఈనాటికీ కళ్ళముందు కదులుతూనే ఉంది. మదిలో మెదులుతూనే ఉంది. పెద్ద, చిన్న, ధనిక, పేద, కుల,మత తేడాలు లేకుండా ఏమాత్రమూ పరిచయం లేని ఓ మహత్తర కార్యక్రమాన్ని బృహత్తరంగా నిర్వహించారు ప్రజానీకం. నరసాపురం పట్టణాన్ని వరద ముంపునుంచి తమను తామే కాపాడుకున్నారు ప్రజానీకం.

‘సృష్టికి ప్రతిసృష్టిని ఒనరించు మానవుడే మహనీయుడు’
అన్న ఆరుద్ర మాట అక్షర సత్యమయింది ఆరోజున!!

ఓ నదియొక్క వఱదలను చూడటం తన జీవితంలో అదే మొదటిసారి అయినప్పటికీ తిండి, తిప్పలు, నిద్ర, నిప్పులు అన్నీ మానుకుని ప్రళయవేళ ప్రజలందరికీ ఓ దీపస్తంభంలా నిలబడ్డ ఆనాటి సబ్ కలెక్టర్ ఎస్.పి.సింగ్,ONGC అధికారులకు వేనవేల దండాలు.

మా పొలంలో మా రైతు కుటుంబం ఏమైపోయిందో తెలవక మా అమ్మ గారు బెంగ పెట్టుకున్నారు. మా రైతుకు పదిరోజుల క్రితమే మనవరాలు పుట్టింది. ఊర్లోని ప్రజలందరూ సురక్షిత స్థానాలకు చేరుకున్నారని మా రైతు వచ్చి చెప్పాడు. సాయంత్రం మా రైతు కుటుంబం అంతా మా ఇంటికి వచ్చేశారు. మకాంలోని ఆవులు, గేదెలను కట్లు విప్పి వదిలేశారు. వాటిని తీసుకుని రావటం కోసం ఓ పడవను ఇప్పించమని మా సబ్ కలెక్టర్ శ్రీ ఎస్.పి.సింగ్ గారిని అడిగాను. మనుషులను తీసుకురావడానికైతే ఇస్తాను కాని పశువుల కోసం ఇవ్వనన్నారు.(ఈ ఎస్పీ సింగ్ తెలంగాణ ఛీఫ్ సెక్రటరీ గా రిటైరయ్యారు). దాదాపుగా నెల రోజులు నీళ్ళు నిలిచిపోయాయి.ప్రజలు నానా కష్టాలు పడ్డారు. లైన్స్, రోటరీ, మరెన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేశాయి. పదిరోజులకు కరెంట్ వచ్చింది.సంవత్సరం తరువాత రోడ్లు వేశారు.

వఱద బాధితులను పరామర్శించడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వచ్చారు. కానీ రాష్ట్రం కోరిన మొత్తాన్ని కేంద్రం ఇవ్వలేదు. దీని గురించి నానా యాగీ అయింది. చిత్రమేమంటే తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో అటు కేంద్రంలోని ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని ప్రభుత్వం రెండూ అపజయం పాలయ్యాయి.

ఈ వరద పగటిపూట రావడంతో ఆస్తి నష్టమే తప్ప ప్రాణనష్టం పెద్దగా జరగలేదు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ప్రాణాలు నష్టపోయారు. మొన్న వరద వచ్చినప్పుడు ఇది కూడా అంత పెద్దదవుతుందేమో అని భయమేసింది.

అప్పుడు ఇచ్చిన హామీ… గోదావరి గట్లు పటిష్టం చేస్తామని!
కాని కొన్ని చోట్ల మ్రొక్కుబడిగా పనులు జరిగాయే కాని పటిష్ఠంగా జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని నదుల గట్లను పటిష్టం చేసి ప్రజలకు వరద నుండి భద్రత కల్పించాలి. ఈ కార్యక్రమంలో నా ప్రాతినిధ్యం కూడ ఉండడం నా అదృష్టం.

–  చక్రావధానుల రెడ్డప్ప ధవేజి.
9703115588

 

Also Read: 1986 గోదావరి వరదల చేదు జ్ఞాపకం

RELATED ARTICLES

Most Popular

న్యూస్