ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు, గల్ఫ్ దేశాల్లో తిరుగుబాట్లు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రపంచ గమనాన్ని మారుస్తున్నాయి. నిలకడ లేని నాయకత్వాలు, అగ్ర దేశాల రాజకీయ కుతంత్రాలతో విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను తారుమారు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 1.10 కోట్ల మంది ఉక్రెయిన్‌ను వీడినట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ ప్రకటించింది. ఈ మేరకు శరణార్థుల సంస్థకు సారథ్యం వహిస్తున్న ఫిలిప్పో గ్రాండీ జెనీవాలో మీడియాకు తెలిపారు.
సంక్షోభాలు, మానవ హక్కుల ఉల్లంఘన, హింస కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదా పు 11 కోట్ల మంది సొంత దేశాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి శరణార్థులుగా జీవిస్తున్నారని, సూడాన్ అంతర్యుద్ధం కారణంగా ఒక్క ఏప్రిల్‌లోనే 20 లక్షల మంది నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనరేట్ (యూఎన్‌హెచ్‌సీఆర్) వెల్లడించింది.
గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1.90 కోట్ల మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. కాంగో, ఇథియోపియా, మయన్మార్‌లలో చెలరేగిన హింస కారణంగా ఒక్కో దేశంలో 10 లక్షల మంది చొప్పున శరణార్థులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.