Saturday, January 18, 2025
HomeTrending Newsరెండో దశ ప్రశాంతం.. త్రిపురలో అత్యధిక పోలింగ్

రెండో దశ ప్రశాంతం.. త్రిపురలో అత్యధిక పోలింగ్

లోక్‌సభ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 13 రాష్ట్రాలలోని 88 లోక్‌సభ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో దాదాపుగా 63.5శాతం ఓటింగ్‌ నమోదైంది. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ జరిగింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. త్రిపురలో అత్యధికంగా 79.46 శాతం పోలింగ్‌ జరిగింది. ఆ తర్వాత మణిపూర్‌లో 77.32 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో 54.85 శాతం, బిహార్‌లో 55.08 శాతం పోలింగ్‌ జరిగింది. కేరళలోని మొత్తం 20 స్థానాలు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్‌లో 1, త్రిపురలో 1, జమ్ము కశ్మీర్‌లో 1 స్థానానికి రెండో దశలో పోలింగ్‌ జరిగింది.

ఎన్నికలు జరిగిన పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం వల్ల ఓటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. కేరళలో ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొన్న ఒక పోలింగ్‌ ఏజెంట్‌, ఓటేసిన ముగ్గురు ఓటర్లు ఎండ వేడి వల్ల మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని మహసముంద్‌లో భద్రతా విధుల్లో ఉన్న ఓ జవాన్‌ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మణిపూర్‌ కల్లోలిత ప్రాంతాల్లో భారీ భద్రత మధ్య ఓటింగ్‌ జరిగింది. పలుచోట్ల మిలిటెంట్లు ఓటర్లను ఓటేయొద్దని బెదిరించారు. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లాలోని ఇండిగనత గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణతో పలు ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. కాగా, బెంగళూరులోని ఓ ప్రైవేటు దవాఖానలో ఉన్న 41 మంది పేషెంట్లు ఓటు వేసేందుకు గ్రీన్‌ కారిడార్లు ఏర్పాటుచేసి ఆంబులెన్సుల్లో తీసుకెళ్లారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఐదో దశ నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం శుక్రవారం జారీ చేసింది. బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్ముకశ్మీర్‌, లఢక్‌లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 49 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. అతి తక్కువ స్థానాల్లో ఓటింగ్‌ జరగనున్న దశ ఇదే. ఈ విడతలో మే 20న పోలింగ్‌ జరగనుంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్