Not Possible: అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని బిజెపినేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. నాటి ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతుల నుంచి రాజధానికి భూములు తీసుకున్న సమయంలో ఒక అభివృద్ధి పథం చూపించి…. ఆశలు, ఆకాంక్షలు కలిగించి, ఒక ఒప్పందం చేసుకుందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేయకపోతే అది ద్రోహమే అవుతుందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. దీనిపై ప్రశ్నించే హక్కు రైతులకు ఉంటుందన్నారు. రైతులతో చేసుకున్న ఒప్పందాలు అమలు చేయకపోతే కోర్టులు తప్పకుండా కట్టడి చేస్తాయని, ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కూడారాజధాని అభివృద్ధిపై కొన్ని సూచనలు చేసిందని, వాటిని అమలుచేయాలని సూచించారు.
మౌలిక వసతుల కల్పనకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చవుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారీ చెప్పడం సరికాదన్నారు. నేడు పార్టీ నేతలతో కలిసి రాజధాని ప్రాంతాన్నిజీవీఎల్ సందర్శించారు. అసంపూర్తిగా మిగిలిన భవనాల నిర్మాణాన్ని, శిలాఫలకాలను పరిశీలించారు. అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీతో ఏవైనా రాజకీయాలుంటే అవి వేరే విధంగా చేసుకోవాలి కానీ రైతులకు ద్రోహం చేయడం దుర్మార్గమని, ఇప్పటికైనా రైతులపై కక్ష సాధింపు మానుకోవాలని ప్రభుత్వానికి జీవీఎల్ హితవు పలికారు. మూడు రాజధానులు అనేది సాధ్యం కాదని, ఈ విషయం వైఎస్సార్సీపీకి కూడా అర్ధమైందని, అందుకే బిల్లులను వెనక్కు తీసుకుందని, ఒకవేళ తీసుకు రావాలనుకుంటే గత అసెంబ్లీ సమావేశాల్లోనే తెచ్చి ఉండేవారని అన్నారు. ఈ విషయంలో మరో కొత్త చట్టం చేయలేరు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అమరావతి ప్రాంతానికి కేంద్రం ఎన్నో సంస్థలను నెలకొల్పేందుకు నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పిస్తే ఆ సంస్థల నిర్మాణం వెంటనే ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్రం నుంచి సరైన సహకారం అందడం లేదని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఓ ప్రణాళిక వెల్లడించాలని కోరారు.
మందడం లో షుమారు 700 టిడ్కో ఇళ్ళ నిర్మాణం పూర్తయ్యిందని, వాటికి కనీస వసతులు కల్పించి వెంటనే లబ్దిదారులకు అందజేయాలని, ప్రతి పట్టణం బైటా ఈ టిడ్కో నిర్మాణాలు ఏవో స్థూపాలులాగా ఉంచడం మంచిది కాదన్నారు. ప్రభుత్వం ముందుకు రాకపోతే నేరుగా కేంద్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు అందించేలా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ విషయమై కేంద్ర అధికారులతో కలిసి మాట్లాడుతానని ఎంపీ జీవీఎల్ చెప్పారు.
Also Read : నిధులు మావి- ప్రచారం మీదా?: జీవీఎల్