Saturday, November 23, 2024
HomeTrending NewsAmarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత

జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్ యాత్ర తొలి బ్యాచ్ బయలుదేరింది. జమ్మూ బేస్ క్యాంపులోని యాత్రి నివాస్ నుంచి బల్తాల్, పహల్గామ్ క్యాంపులకు భారీ భద్రత మధ్య బస్సుల్లో యాత్రికులు పయనమ్యారు. యాత్రికుల వాహనాలను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. అమర్‌నాథ్‌ యాత్ర మొదటి బ్యాచ్‌ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్రకు 3.5 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 3,400 మంది యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయానికి బయలుదేరారు.

పహల్గామ్ బేస్ క్యాంపు నుంచి వెళ్లే యాత్రికులు దక్షిణ కశ్మీర్‌లోని నున్వాన్ దారి మీదుగా 48 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. బల్తాల్ బేస్ క్యాంపు నుంచి వెళ్తే సెంట్రల్ కశ్మీర్‌లోని గండర్బల్ మీదుగా 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. శ్రీ అమర్‌నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు లింగాన్ని దర్శించుకోడానికి భక్తులు ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యాత్ర జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజులపాటు కొనసాగుతుంది.

ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర కోసం జమ్మూ కశ్మీర్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. మరోవైపు, అమర్‌నాథ్‌ యాత్రకు స్పాట్‌ రిజిస్ట్రేషన్లు గురువారం ప్రారంభమయ్యాయి. అమర్‌నాథ్ యాత్ర కోసం పెద్దఎత్తున సాధువులు సహా 1500 మందికి పైగా యాత్రికులు జమ్ముకు చేరుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని షాలిమార్‌ ప్రాంతంలో అధికారులు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలాగే సాధువుల కోసం ప్రత్యేకంగా పురానీ మండీ ప్రాంతంలోని రామాలయం ఆవరణలో మరో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.

కాగా, గతంలో ఈ యాత్రకు సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ (CRPF) భద్రత కల్పిస్తూ ఉండేది. ఇకపై దీనికి బదులుగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) చేత భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అమర్‌నాథ్ యాత్రలో ఆరు చోట్ల ఐటీబీపీ, బీఎస్ఎఫ్ దళాలను మోహరించి, భద్రత కల్పిస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రకు భద్రత కోసం ఐటీబీపీని వినియోగించడం ఇదే మొదటిసారి. అమర్‌నాథ్ ఆలయ మండలి, జమ్మూ కశ్మీరు పోలీసులు ఇచ్చిన సూచనలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతేడాది జులై 8న అమర్‌నాథ్‌లో మెరుపు వేగంతో వరదలు సంభవించినప్పుడు ఐటీబీపీ జవాన్లు అత్యంత సమర్థవంతంగా రెస్క్యూ చేపట్టారు. చాలా మంది భక్తులను కాపాడారని, అందువల్ల ఈసారి భద్రత బాధ్యతను వారికే అప్పగించాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు సీఆర్‌పీఎఫ్ దళాలను మణిపూర్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలించడం కూడా దీనికి మరొక కారణంగా చెప్తున్నారు. మణిపూర్‌లో రెండు నెలలుగా హింస కొనసాగడం, బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్