Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొంచెం దుఃఖం +కొంచెం సంతోషం = 35

కొంచెం దుఃఖం +కొంచెం సంతోషం = 35

చిన్నతనంలో లెక్కలంటే భయపడని వాళ్లుండరు. ఉన్నారంటే ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్ళలానే చూస్తారు. నాకూ చిన్నప్పుడు లెక్కలంటే భయమే. 10 లో అన్ని సబ్జక్ట్స్ లో 70 దాటినా లెక్కల్లో 50 రావడం కష్టమై పోయింది. ఈ భయాన్ని దాటాలంటే ఎంపిసి తీసుకోడమే దారి అనిపించింది. అక్కడికీ నేను ఇంటర్ చదివిన సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ బైపిసీ తీసుకోమన్నారు. వద్దన్నాను. ఎంపీసీ తీసుకుని ఫస్ట్ ఇయర్ లో అతి కష్టం మీద పాస్ మార్క్స్ సాధించా. సెకండ్ ఇయర్ లో దొరికారు శర్మ మాస్టారు. ఆయన దగ్గరకి పొద్దున్నే ట్యూషన్ కి వెళ్ళేవాళ్ళం. ఎంత బాగా చెప్పేవారో. ఆయన పుణ్యమా అని నాలుగు లెక్కలు నేర్చుకుని సెకండ్ ఇయర్ లో తొంభై శాతం సాధించి విజయహాసం చిందించా. అక్కడినుంచి డిగ్రీ వరకు మాథ్స్ నాకు ఇష్టమైన సబ్జెక్టు. బీకామ్ లో కూడా మాథ్స్ లో తొంభై పైనే వచ్చాయి. అలా అని నేనేమీ లెక్కల్లో పెద్ద డిగ్రీలు చెయ్యలేదు. ఇష్టం అంతే. లెక్కల చిక్కులు తేలిపోయేలా చేసిన శర్మ మాస్టారు ఎక్కడున్నా బాగుండాలి. అలా చెప్పే వాళ్ళు ఉంటే భయం పోతుంది.

ఇదంతా ఎందుకు అంటే నిన్న 35 అనే సినిమా చూశాక మదిలో గుర్తొచ్చిన గతం. నిజంగానే ఈ సినిమాలో చూపినట్టు లెక్కల మాస్టార్లు చాలామందికి ఒక రకమైన ఇగో ఉంటుంది. స్టూడెంట్ ప్రశ్న అడిగితే వాళ్ళని రకరకాలుగా హేళన చేస్తారు. ఆ భయానికి చాలామంది అడగరు. లెక్కల పైన, మాస్టారి పైన కోపం పెంచుకుంటారు. జీవితంలో ఎప్పుడూ లెక్కల జోలికి పోరు. కానీ అది పరిష్కారం కాదు. సినిమాలో చూపినట్టు తల్లి బాధ్యత మాత్రమే కూడా కాదు. తగిన టీచర్ ని వెతికి పట్టుకోవాలి. టీచర్ ని గట్టిగా అడగలేకపోవడమూ మామూలే. మా నాన్న అలా అడిగినందుకు నేను చాలా రోజులు స్కూల్ లో వెక్కిరింపులు ఎదుర్కొన్నా.

నిజంగా 35 సినిమా మనసును తాకింది. కొన్ని విషయాలు టూ మచ్ అనిపించినా మొత్తం మీద బాగుంది. ఫీల్ గుడ్ సినిమా. పిల్లలు, తల్లిదండ్రులు తప్పక చూడాలి. చివరగా చిన్నమాట- తల్లి, పిల్లవాడు అంత కష్టపడినా 35 మార్కులే రావడం టైటిల్ కోసమేమో అనిపించింది. సినిమా న్యాయం అంటారా? సరే, అలాగే కానివ్వండి.

-కె.శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్