Sunday, January 19, 2025
HomeTrending Newsవియత్నాం యుద్దానికి 50 ఏళ్ళు

వియత్నాం యుద్దానికి 50 ఏళ్ళు

50 Years Vietnam War : యాభై ఏళ్ళ క్రితం ఇదే జూన్ ఎనిమిదో తేదీన (1972) వియత్నాంలోని ట్రాంగ్ బ్యాంగ్ అనే గ్రామంలో చిన్నపిల్లలు భయపడుతూ పరుగులు తీశారు. వారి వెనుక ఏమీ చేయలేని దుస్థితిలో కొందరు సైనికులు వచ్చారు. వీరి వెనుక ఓ అణుబాంబు పేలి దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఈ దృశ్యాన్ని నిక్ ఉట్ (Nick Ut) అనే అతను తన కెమెరాలో బంధించాడు.

ఈ ఫోటోలో ఒంటిమీద నూలుపోగు లేకుండా గాయాలతో పరుగులు తీసిన తొమ్మిదేళ్ళ ఓ బాలిక కూడా ఉంది. అప్పట్లో ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది.

 

ఓ యుద్ధ బీభత్సాన్ని చెప్పడానికి ఇంతకన్నా మరొక ఫోటో అవసరం లేదుగా!?

అసోసియేట్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ నిక్ ఉట్ ఈ దృశ్యాన్ని ఫోటో తీయడమే కాకుండా ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకుపోయి చికిత్సకు ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు, తరచూ ఆ బాలికను కలిసి ఎలా ఉన్నావని ఆరా తీసేవాడు. నేనున్నానని ధైర్యం చెప్పేవాడు.

సరైన సమయంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడానికి నిక్ ఉట్ చేసిన ప్రయత్నంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఆ ఫోటో ప్రపంచాన్ని కుదిపేసింది.

 

 

జాతీయ రహదారికి యాభై గజాల దూరంలో ఉన్న Cao Dai అనే ఆలయంలో కొందరు పౌరులు తలదాచుకుంటున్నారన్న విషయం తెలిసి ఈ బాంబుదాడి జరిగింది. అనుకోని ఈ దారుణ దాడిలో అక్కడున్న చిన్నా పెద్దా అందరూ పరుగులు తీశారు.

ఫోటోగ్రాఫర్ నిక్ ఉట్ మాట్లాడుతూ “ఆరోజు (1972 జూన్ 8) ఉదయం అణుబాంబు దాడి జరగడానికి కొన్ని నిముషాల ముందర నేనక్కడికొచ్చి కొందరు విలేకరులతో మాట్లాడుతున్నాను.
ఉన్నట్టుండి బాంబు పేలిన శబ్దం వినిపించింది. పిల్లలు, పెద్దలు (వీరిలో ఎక్కువ మంది మహిళలే) పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓ కుక్క, ఓ పిల్లికూడా పరిగెత్తుకుంటూ రావడం చూశాను. ఇదంతా నా కెమెరాతో చిత్రీకరిస్తూ వచ్చాను. ఇంతలో ఓ వృద్ధురాలు ఓ ఏడాది వయస్సున్న మనవడిని ఎత్తుకుని పరిగెత్తుకు రావడం చూశాను. వారితోపాటు ఓ తొమ్మిదేళ్ళ అమ్మాయి కూడా ఉంది. తన మనవరాలిని కాపాడమని అరుస్తోంది. వారి వెనుక దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. తీవ్రగాయాలతో ఉన్న బాలిక దుస్థితిని కెమెరా కళ్ళల్లోంచి చూసాను. అంతే ఆ క్షణమే కెమెరా భుజానికి తగిలించుకుని వెంటనే ఆ చిన్నారి దగ్గరకు వెళ్ళాను. ఆమె పరిస్థితిని చూస్తే ఇంకొన్ని నిముషాలకు చనిపోతుందేమో అన్పించింది. అంతే ఆ బాలిక మీద నీరు పోసాను. అప్పుడా అమ్మాయి నా దేహంమీద నీరు పోయడం కాదు… నా గొంతు తడపడానికి నీరు కావాలి… అంది. వేడి భరించలేక పోతున్నాను అంది. నేను చచ్చిపోతానంటూ రోదించింది. ఇక ఆలస్యం చేస్తే తొమ్మిదేళ్ళ Kim Phuc ప్రాణానికే ప్రమాదమని గ్రహించాను. ఆ అమ్మాయితో పాటు గాయపడిన మరికొందరు పిల్లలను మా అసోసియేటెడ్ ప్రెస్ వ్యానులోకి ఎక్కించి Củ Chi ఆస్పత్రికి తీసుకుపోయాను. ఆస్పత్రి సిబ్బంది ఆ బాలిక గాయాలను చూసి చికిత్స చేయడానికి ఆలోచనలో పడ్డారు. ఈ బాలిక బతకడం కష్టమన్నట్టుగా మాట్లాడుకున్నారు. కానీ నేను నా ప్రెస్ కార్డు చూపించి వీలైన మేరకు ఆ అమ్మాయికి చికిత్స చేయమని బతిమాలాను. దాంతో ఆస్పత్రి సిబ్బంది ఆ బాలికను అడ్మిట్ చేసుకుని వైద్యమందించారు. ఆ బాలిక బతికింది. తర్వాతి రోజు దాదాపుగా అన్ని పత్రికలలో నేను తీసిన ఫోటోలను ప్రముఖంగా ప్రచురించాయి. తర్వాత ఒక మాట చెప్పాలన్పించింది. ఇటువంటి సందర్భాలలో ఫోటోలు తీయడం మాని గాయపడిన వారు ఎవరైనా కావచ్చు. వారిని ఆలస్యం కాకుండా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించి ప్రాణాలు కాపాడటం సాటి మనిషిగా మన కనీస కర్తవ్యం” అన్నాడు.

“Kim Phuc – Nick ut – Napalm Girl” అనే ఈ ఫోటోకు యాభై ఏళ్ళు ఇప్పుడు.

 

కానీ ఈ ప్రపంచం ఇప్పటికింకా యుద్ధాల నుంచి పాఠం నేర్చుకోలేదు. యుద్ధాలు మానవాళి మనుగడకు ఎంత ప్రమాదకరమో తెలుసుకోకపోవడం బాధాకరం. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు చర్చల ద్వారా పరిష్కరించడం మాని యుద్ధానికి దిగడం ఎంత దారుణమో.

– యామిజాల జగదీశ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్