Saturday, November 23, 2024
HomeTrending Newsమూడేళ్ళలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు

మూడేళ్ళలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు

ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 5జీ సేవ‌లు భారత దేశంలో మొద‌ల‌య్యాయి. ఢిల్లీలో జ‌రుగుతున్న‌ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవ‌ల‌ను అధికారికంగా ఈ రోజు (శ‌నివారం) ప్రారంభించారు. 5జీ సేవ‌లకు సంబంధించిన డెమోను రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబాని ప్రధానమంత్రి నరేంద్ర మోడికి వివరించారు.

రిలయన్స్ జియో, ఎయిర్‌‌‌‌‌‌‌ టెల్, వీఐ ద్వారా 5జీ సేవలు ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై నగరాల్లో ముందుగా అందుబాటులోకి వస్తాయి. రిలయన్స్ జియో ఇప్పటికే జియో 5జీ సర్వీస్ ను ద‌శ‌ల వారీగా అందించాల‌ని త‌మ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణ‌యించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్ర‌ధాన న‌గ‌రాలు.. ఢిల్లీ, కోల్‌క‌తా, చెన్నై, ముంబైలో 5జీ సేవలను ప్రారంభించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అంటే ఈ నెల‌ఖ‌రు వ‌ర‌కు ఈ న‌గరాల్లో 5జీ నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌స్తుంది. మరో 9 నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చండీఘడ్, గాంధీనగర్, గురుగ్రాం, జామ్నగర్, లక్నో, పూణే నగరాల్లో మరి కొద్ది రోజుల తర్వాత అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.  ఇందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో జియో 5జీ సేవలు పొందాలంటే వ‌చ్చే ఏడాది వ‌రకు వేచి చూడాల్సి ఉంటుంది. కాబ‌ట్టి 5జీ సేవ‌లు ఈ రోజే మొద‌లైనా.. అంద‌రూ దాన్ని ఉప‌యోగించడం కుద‌ర‌దు. తెలుగు రాష్ట్రాల్లో 5జీ ఇప్పుడే మొద‌ల‌య్యే అవ‌కాశం లేదు. వాస్తవానికి ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబై న‌గ‌రాల్లో కూడా దీపావ‌ళి నాటికి కొన్ని ప్రాంతాల్లోనే జియో 5జీ సేవ‌లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ విమానాశ్రయం మూడో టెర్మినల్‌లో సేవలకు 5జీ సిద్ధంగా ఉంది. అక్క‌డి ప్రయాణికులు 20 రెట్ల వేగవంతమైన కనెక్టివిటీని పొందుతారు. 5జీ సేవలు రెండు, మూడేళ్ల‌లో దేశంలోని ప్రతి ప్రాంతానికి ఈ సేవలను అందుబాటులోకి తెస్తామ‌ని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు.

ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈనెల 4వ తేదీ వరకు కొనసాగుతుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) కలసి నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో జ‌రిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో ఒక‌టిన్న‌ర‌ లక్షల కోట్ల రూపాయల మొత్తం బిడ్లను డాట్ అందుకుంది. స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో, అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పాల్గొన్నాయి. అదానీ గ్రూప్‌‌ తన సొంత అవసరాల కోసం స్పెక్ర్టమ్ ను కొన్నది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్