Saturday, January 18, 2025
HomeTrending Newsకేంద్రం కీలక నిర్ణయం... త్వరలోనే 5జీ సేవలు

కేంద్రం కీలక నిర్ణయం… త్వరలోనే 5జీ సేవలు

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మన దేశంలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి తేవడానికి రంగం సిద్ధం చేస్తున్నది. ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజలకు, కంపెనీలకు 5జీ సేవలు అందుబాటులోకి తేవడానికి టెలికమ్యూనికేషన్స్ శాఖ 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

20 ఏళ్ల పాటు చెల్లబాటు అయ్యేలా 72097.85 మెగా హెట్జ్‌ల స్పెక్ట్రమ్ వేలం వేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. జులై చివరికల్లా ఈ వేలం జరగనున్నట్టు కేంద్రం తెలిపింది. ఇందులో మూడు దిగ్గజ క్యారియర్లు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన జియోలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

5జీ స్పెక్ట్రమ్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లకు నిర్వహణ ఖర్చును తగ్గిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అప్‌ఫ్రంట్ పేమెంట్‌ను తొలగిస్తున్నట్టూ తెలిపింది. 5జీ స్పెక్ట్రమ్ కోసం 20 నెలలు సమాన మొత్తంలో ఇన్‌స్టాల్‌మెంట్లు చెల్లించాల్సి ఉంటుందని సక్సెస్‌ఫుల్ బిడ్డర్స్‌ను ఉద్దేశిస్తూ వివరించింది.

5జీ సేవలు కొత్త వ్యాపారాలను సృష్టిస్తాయని, కంపెనీలకు అదనపు ఆదాయాలను సమకూర్చుతుందని, ఉద్యోగ అవకాశాలనూ పెంచుతుందని కేంద్రం తెలిపింది. సాంకేతిక వినియోగాన్ని కూడా పెంచుతుందని అభిప్రాయపడింది. టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్ వినియోగిస్తాయని వివరించింది. దీని స్పీడ్, సామర్థ్యం ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం ప్రకటన ప్రకారం, వేలం మూడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లుగా విభజించింది. లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు(600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ (3300 MHz), హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ (26 GHz)లుగా ఉంటుందని వివరించింది.

5జీ స్పెక్ట్రమ్‌తో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇతర కార్యక్రమాలకు డిజిటల్ కనెక్టివిటీ ప్రధానంగా మారుతుందని కేంద్రం వివరించింది. ఇప్పుడు ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రజల నిత్య జీవితాల్లో భాగంగా మారిపోయాయి. ఈ ధోరణి వల్లే 4జీ సేవలు కూడా వేగంగా విస్తరించాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దేశంలో సుమారు 80 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు బ్రాడ్ బ్యాండ్ సేవలు వినియోగిస్తున్నారని, అంతుకు ముందు ఈ సబ్‌స్క్రైబర్లు చాలా తక్కువగా ఉండేవారని, సుమారు 10 కోట్లకు అటూ ఇటూగా ఉండేవారని పేర్కొంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్