Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Pin :  రమ్య స్కూలుకి వెళ్ళడానికి తయార వుతోంది. యూనిఫాం చొక్కాలో ఓ గుండీ లేదన్న విషయాన్ని అప్పుడే తెలుసుకుంది. పోనీ ఇంకొక చొక్కా వేసుకుందామంటే అది ఇస్త్రీ చేసి లేదు. బటన్ కుట్టి వేసుకుందామంటే టైము లేదు. ఏం చేయాలాని ఆలోచించింది. ఇంతలో బల్ల మీద ఓ పిన్ను కనిపించింది. అమ్మయ్య అనుకుని బటన్ లేని చోట ఆ పిన్ను పెట్టుకుని అప్పటికి సరిపెట్టుకుని స్కూలుకి వెళ్ళిపోయింది.

ఏముంది, మామూలు పిన్నే అనుకుంటాం కానీ దాని ఉపయోగం ఎలా ఏ సమయంలో ఉంటుందో ఊహించలేం.
స్కూలుకెళ్ళే రోజుల్లో ఇలా పిన్నుని ఉపయోగించినవాళ్ళమే అయ్యుంటాం మనమందరం.

ఈ పిన్ను వాడకం అనాది నుంచీ వాడుకలో ఉన్నదే. నా చిన్నతనంలో రబ్బర్ చెప్పులో స్ట్రాప్ తెగిపోతే అవసరానికి ఉపయోగపడింది పిన్నే. అయితే ఈ పిన్ను (సేఫ్టీ పిన్ను) వెనుక ఓ కథ ఉంది.

1849లో వాల్టర్ అనే అతను ఆర్థిక ఇబ్బందులతో కష్టాల్లో పడ్డాడు. తన మిత్రుడి దగ్గర తీసుకున్న అప్పునెలా తీర్చాలా అనే ఆలోచనలో పడ్డాడు. తిరిగిస్తానన్న టైముకి ఇవ్వలేకపోతున్నానని సిగ్గుపడ్డాడు.

అప్పుడతని చేతిలో ఓ తీగ ఉంది. ఆ తీగతో ఏవేవో చేస్తూ వచ్చాడు. రకరకాల ఆకారాలతో చేస్తూ చెరుపుతూ ఆలోచీస్తున్నాడు చేసిన అప్పు గురించి.
ఇంతలో అతనికి ఓ మెరుపులాటి ఆలోచన వచ్చింది. వెంటనే ఓ కాగితం తీసుకుని దాని మీద వివిధ ఆకారాలలో బొమ్మలు గీశాడు. చివరికి సేఫ్టీ పిన్ను ఆకారంలో ఓ బొమ్మ గీసాడు.

1849 ఏప్రిల్ పదో తేదీన సేఫ్టీ పిన్ను తయారీకి పేటెంట్ హక్కులు సంపాదించాడు హంట్!

అనంతరం ఆ హక్కులను డబ్ల్యూ ఆర్. గ్రేస్ సంస్థకు అమ్మాడు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో అతను అప్పు తీర్చాడు.

ఇతను కనుగొన్న ఆ సేఫ్టీ పిన్ను ఆకారమే ఈనాటికీ వాడుకలో ఉంది.

హంట్ పూర్తి పేరు వాల్టర్ హంట్. అతను ఈ పిన్నుని కనుగొన్న తొలి రోజుల్లో దీని ధర ఎక్కువగా ఉండేది.

ఈ పిన్నులకు సంబంధించి కొన్ని విషయాలు చూద్దాం…

కొత్త ఏడాదిలో జనవరి ఒకటి లేదా రెండో తేదీన పిన్నుని కొని పెట్టుకుంటే ఏడాది పొడవునా తరగని సంపద ఉంటుందని ఆకాలంలో నమ్మేవారు.

న్యూయార్కులో శామ్యువేల్ సోల్కం పిన్ను తయారు చేసే సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ రోజుకి లక్ష పిన్నులు తయారు చేసేది.

ఒకానొకప్పుడు మన భారతదేశంలోనూ కొన్ని ప్రాంతాలలో సూది, పిన్ను కూతుర్ని కాపురానికి పంపేటప్పుడు కట్నకానుకగా ఇచ్చే అలవాటుండేది.

ఉక్రైన్ లో పిల్లల చొక్కాకు పిన్ను ఉంటే అది దుష్టశక్తుల నుంచి పిల్లలను కాపాడుతుందనే నమ్మకముండేది.

ఐరోపా దేశాలలో పిన్నుని అదృష్టానికి సంకేతంగా భావించేవారు.

– యామిజాల జగదీశ్

Also Read :

పాత బస్సు.. ఇప్పుడు తరగతి గది!

 

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com