Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబీర్ టానింగ్ తో చర్మ క్యాన్సర్?

బీర్ టానింగ్ తో చర్మ క్యాన్సర్?

Beer – Bath: స్నానాలు ఎన్ని రకములు? వాటి స్వరూప స్వభావాలు, వాటికోసమయ్యే ఖర్చు? వాటి వల్ల ప్రయోజనములెట్టివి? అన్న చర్చ కాదిది. నూనె పూసి, నలుగు పెట్టి చేసే అభ్యంగన స్నానాలు సంప్రదాయంలో ఉంటే ఉండవచ్చుగాక. కలవారి ఇళ్లల్లో ఇంద్రలోకం సిగ్గుపడాల్సిన బాత్ టబ్బులో పరిమళభరిత నురగలు తెలిమబ్బుల్లా తేలితే తేలవచ్చుగాక. ఒళ్లంతా బురద పట్టించుకుని మడ్ బాత్ ల మృత్తికా స్నానాలు ఉంటే ఉండవచ్చుగాక. ఆరోగ్యానికి ఊపిరిలూదే ఆవిరి స్నానాల మెత్తదనం ఉంటే ఉండవచ్చుగాక.

గంధము పూయరుగా పన్నీరు గంధము పూయరుగా…అని పక్కన సుగంధాలు చల్లుతుండగా స్నానాల చెరువుల్లో వెనకటికి మహరాణులు మహా వైభోగ స్నానాలు చేస్తే చేసి ఉండవచ్చుగాక.

లేనివారు వేన్నీళ్లకు చన్నీళ్లు కలుపుకుని కొలిచి…చేసే నాలుగు మగ్గుల తడుపు స్నానాలు తెలిసినవే. చాకొలేట్ స్నానాలు, తలంటు స్నానాలు, సామూహిక స్నానాలు, నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, పుష్కర స్నానాలు, మూడు మునకలు, పుణ్య స్నానాలు, తీర్థ స్నానాలు, మంత్ర స్నానాలు, యాగానికి ముందు స్నానాలు, యాగాలు అయ్యాక చేసే అవభృత స్నానాలు, సూర్య స్నానాలు…ఇలా స్నానపురాణంలో లెక్కలేనన్ని పర్వాలు.

ఎన్ని స్నానాలు చేసినా ఎలుక తోలు నలుపే కానీ…తెలుపు కానే కాదని…వేమన ఆనాడే రుజువు చెప్పాడు. ధనం ఎంత నల నల్లగా ఉంటే అంత తృప్తి. ఒంటి చర్మం ఎంత తెల తెల్లగా ఉంటే అంత తృప్తి. అందం. ఆనందం. చర్మం తెల్లగా, మృదువుగా, నున్నగా తయారవుతుందంటే లోకం అగ్గిలో దూకమన్నా దూకుతుంది. ఎన్ని రసాయనాలను ఒంటిమీద పోసుకోమన్నా పోసుకుంటుంది. మందులు మింగమంటే మింగుతుంది. అన్నం తినద్దు అంటే నోరు కట్టేసుకుంటుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. లేవమంటే లేస్తుంది. తళతళలాడే తెలుపు- నునుపు వస్తుందంటే ఏమయినా చేస్తుంది.

బీచుల్లో సభ్యతగా బట్టలిప్పి చేసే సన్ బాత్ – సూర్య స్నానాలు ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు బీచుల్లో గోచిపాతలతో ఒంటిమీద బీర్ పోసుకుని…ఎదురెండలో పడుకోవడం లేటెస్ట్ ట్రెండ్. దీనికి “బీర్ టానింగ్” అని నామకరణం కూడా చేసింది పాశ్చాత్య సమాజం. దీనితో ఒంటిమీద మాలిన్యం పోయి…చర్మశుద్ధి జరిగి…తెలుపెక్కుతారని… ఎరుపెక్కుతారని…నునుపెక్కుతారని…వయసు వాయువేగంతో వెనక్కు పరుగులు తీసి…మన నిత్యనూతన నిగనిగల అందం మనకే ముద్దొస్తుందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యింది. అంతే- వాట్సాప్ యూనివర్సిటీ చెప్పింది వేదం కనుక గుడ్డిగా లోకం పాటిస్తోంది.

హాయిగా చిల్డ్ బీరు తాగకుండా కొన్ని కోట్ల లీటర్ల బీరును ఇలా మలిన దేహాల మీద కుమ్మరిస్తారా అని బీర్బలుల మనోభావాలు తీవ్రంగా గాయపడి…ద్రవిస్తున్నాయి.

బీర్ టానింగ్ తో చర్మం తెలుపు- నునుపు సంగతేమో కానీ…చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయని చర్మవ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీర్ స్నానం వల్ల అందులో ఉన్న మెలనిన్ చర్మ కాంతిని పెంచుతుందన్నది నమ్ముతున్నవారి వాదన. దీనికి శాస్త్రీయమయిన రుజువుల్లేవని ఈ మోజులో పడి…కోరి అనర్థాలను కొని తెచ్చుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

తాగే బీరు కాయలకే వేల కోట్లు ద్రవమవుతోంది. ఇండియాలో కూడా బీర్ టానింగ్ స్నానాలు మొదలయితే…బీర్ స్నానం చేసి…బీర్ తాగాలా? బీర్ తాగి…బీర్ స్నానం చేయాలా? లేక డబుల్ కా మీఠాలా బీర్ స్నానం చేస్తూ బీర్ తాగాలా? అన్న ఉక్కిరి బిక్కిరిలో జాతీయ స్థూల తలసరి బీర్ వినిమయానికి తగినట్లు జాతీయ బీర్ స్థూల ఉత్పత్తి జరుగుతుందా ? అన్నదే పెద్ద చిల్డ్ ద్రవ సందేహం!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్