చంద్రబాబుకు ఎన్టీ రామారావు శాపం కూడా తగిలిందని, అందుకే ఆయన జైలుకు వెళ్ళాడని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. చంద్రబాబు జైలుకు పోగానే, పార్టీ పగ్గాల కోసం అప్పుడే నేతలు బయటకు వస్తున్నారని, యనమల రామకృష్ణుడు, నందమూరి బాలకృష్ణ పార్టీ కబ్జా కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నారా లోకేశ్‌కు పార్టీ నడిపే సత్తా లేదని, ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదని, అందుకే ఎవరికి వారు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారని, అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మళ్ళీ ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుకు రిమాండ్ కు నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే ప్రజా స్పందన లేదని, చివరకు ఆ పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. చివరకు హెరిటేజ్ షాపులన్నీ తెరిచే ఉన్నాయన్నారు.
” లోకేశ్.. నీ తండ్రి నిప్పు అని, ఆయన అవినీతి చేయలేదని అంటున్నావు కదా? నీవు దానికే కట్టుబడి ఉంటే, మీ అక్రమ ఆస్తుల మీద సీబీఐ దర్యాప్తును ఎందుకు అడ్డుకున్నారు? స్టే ఎందుకు తెచ్చుకున్నారు? దాన్ని తొలగించుకుని, మీ ఆస్తుల మీద దర్యాప్తు జరపనివ్వండి. అప్పుడే మీ నిజాయితీ, నిబద్ధత అందరికీ తెలుస్తుంది” అంటూ సవాల్ చేశారు. తనకు అధికారం అంటే ఏమిటో తెలియదని లోకేశ్ చెబుతున్నారని, కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాకుండా దొడ్డిదారిన మంత్రి అయ్యాడని, స్కిల్ స్కామ్‌లో లోకేశ్ కూడా దోషి అని, ఆయనకూ శిక్ష తప్పదని స్పష్టం చేశారు.