Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసామెతలు- నుడికారాలు

సామెతలు- నుడికారాలు

Trial & Sword:

కక్షిదారు:-
సార్! ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటి ?

న్యాయవాది:-
అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు కిటికీలు తెరవడమే.

క:-
కిటికీలు ముందే మూసుకుపోయాయి కదా సార్!

న్యా:-
అయ్యో! అలాగా ప్రత్యేక విమానంలో వచ్చేప్పుడు పైనుండి సరిగ్గా కనిపించక అలా అన్నాను…అన్ని తలుపులూ అలాగే ఉంటే…ఈ కత్తి కానీ…సుత్తి కానీ…చేత ధరించి…ప్రయత్నించండి.

క:-
సార్! మీరు గతంలో మెకానిక్కా? కార్పెంటరా?

న్యా:-
కర్మణ్యేవాధికారస్తే…

క:-
నా ఖర్మ నాకు వ్యాధికారస్తే…అర్థమయ్యింది సార్…

న్యా:-
సాధారణంగా తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు…

క:-
…ఈరోజు పడమట ఉదయించాడా?

న్యా:-
లేదు…ఈరోజు కూడా తూర్పునే ఉదయించాడు.

క:-
మరి నాకెందుకు చెబుతున్నారు?

న్యా:-
సాధారణ సూత్రాలనే నేను సాధారణంగా చెబుతూ ఉంటాను.

క:-
సార్! మనం ఈ కేసు గెలుస్తున్నామా?

న్యా:-
గెలిచేదంతా న్యాయం కాదు. ఓడినదంతా అన్యాయమూ కాదు. గెలుపులో ఓటమి; ఓటమిలో గెలుపు ఉండకపోవు.

క:-
మీరు చిన్నప్పటి నుండీ ఇలాగే మాట్లాడేవారా?

న్యా:-
ఎందుకు? స్పష్టంగా, తాత్వికంగా, కొటేషన్స్ తో మాట్లాడుతున్నాను కదా? అర్థం కాలేదా?

క:-
మనం ఓడిపోయి చాలా కాలమయ్యింది సార్.

న్యా:-
అవును. నాకు క్లారిటీ ఉంది. ఓటమిలో ఓరిమితో గెలుపును వెతుక్కుంటాను నేను.

క:-
మీరు ఖాళీ సమయంలో ఏమి చేస్తుంటారు?

న్యా:-
కొటేషన్లు ఎత్తి రాస్తుంటాను.

క:-
మాటలు కోటలు దాటుతాయి-చేతలు చేతులు ముడుచుకు కూర్చుంటాయి. మొరిగే కుక్క కరవదు. ఆశ లావు-పీక సన్నం. ఏమీలేని ఆకు ఎగెరెగిరి పడుతుంది. కంచు మోగునట్లు కనకంబు మోగదు సామెతలు ఎప్పుడన్నా ఎత్తి రాశారా?

ఇంతకూ నన్నోడించినందుకు మీ బిల్లు ఎంత సమర్పించుకోమంటారు?

న్యా:-
గంటకు ఇరవై అయిదు లక్షలు. రెండ్రోజుల్లో రెండు కొటేషన్లు ఎత్తి రాసినందుకు మరో ఇరవై లక్షలు అదనం. ప్లస్ జి ఎస్ టీ. ప్లస్ మా జూనియర్లకు చిల్లర ఖర్చులకు తలకు ఒక్కింటికి అయిదు లక్షల చొప్పున ఐదుగురికి…

క:-
సార్. మీరు మూర్తీభవించిన…

న్యా:-
పూర్ ఫెలో…మాట పూర్తీ చెప్పకుండానే…మాట పడిపోయినట్లుంది!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్